మన శరీరం బాక్టీరియా, వైరస్ల వల్ల అనారోగ్యాలకు గురవుతుందని అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది బాక్టీరియా, వైరస్ రెండూ ఒకటేనని భావిస్తుంటారు. కానీ నిజానికి అవి రెండూ వేర్వేరు. బాక్టీరియా, వైరస్ల మధ్య ఉండే తేడాలు ఏమిటో, వాటి వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.
* బాక్టీరియా, వైరస్లు రెండూ పలు రకాల భిన్న ఆకృతుల్లో ఉంటాయి. బాక్టీరియా కన్నా వైరస్లు చాలా చిన్నగా ఉంటాయి. ఇక రెండింటినీ సూక్ష్మ క్రిములని పిలుస్తారు.
* బాక్టీరియా ఎలాంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. కానీ వైరస్లు బతకాలంటే అందుకు మానవ శరీర కణాలు కావాలి. అవి ఒక్కసారి వైరస్‌లకు దొరికితే వైరస్లు ఆ కణాల్లోకి ప్రవేశించి వృద్ధి చెందుతాయి. దీంతో మన శరీర కణాలు చనిపోయి, వైరస్లు మన శరీరంలో నిండిపోతాయి. ఈ క్రమంలో ఆ వైరస్లు వృద్ధి చెందుతున్న కొద్దీ మనలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తుంటాయి. వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే మనకు ప్రాణాపాయం సంభవిస్తుంది.
* బాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నవ్యక్తిని తాకినా, ముద్దు పెట్టుకున్నా, అతనిలో ఉన్న రక్తం మనలో కలిసినా, వారితో శృంగారంలో పాల్గొన్నా, వారు దగ్గినా, తుమ్మినా మనకు బాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. అలాగే గర్భిణీలకు ఆ ఇన్ఫెక్షన్ ఉంటే వారికి పుట్టే పిల్లలకు కూడా ఆ ఇన్ఫెక్షన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక పురుగులు, కీటకాలు బాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్న ఒక వ్యక్తిని కుట్టి అవి తరువాత ఇంకొకర్ని కుడితే వారికి కూడా ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే డోర్ నాబ్స్, హ్యాండిల్స్ తదితర ప్రదేశాలపై ఉండే బాక్టీరియా కూడా మనలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది. ఇక కలుషితమైన నీరు తాగినా, ఆహారం తీసుకున్నా మనకు బాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది. బాక్టీరియాల వల్ల మనకు గొంతు నొప్పి, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్, గనేరియా, టీబీ, బాక్టీరియల్ మెనింజైటిస్, సెల్యులైటిస్, లైమ్ డిసీజ్, టెటనస్, టైపాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. ఈ.కొలి, సాల్మొనెల్లా వంటి వాటిని బాక్టీరియాకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
* ఇక వైరస్ ఇన్ఫెక్షన్లు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చాలా సులభంగా వ్యాపిస్తాయి. ముఖ్యంగా ఇవి ఒకరి శ్వాసకోశ వ్యవస్థకు మొదటగా వ్యాప్తి చెందుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తిని తాకినా, ఆ వ్యక్తికి దగ్గరగా ఉన్నా, గర్భంతో ఉన్న స్త్రీ ద్వారా బిడ్డకు, వైరస్ ఉన్న ప్రదేశాలను తాకినా మనకు వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇన్‌ఫ్లూయెంజా, జలుబు, వైరల్ గ్యాస్ట్రో ఎంటరైటిస్, చికెన్ పాక్స్, మీజిల్స్, వైరల్ మెనింజైటిస్, వార్ట్స్, హెచ్ఐవీ, వైరల్ హెపటైటిస్, జికా వైరస్ తదితర అనారోగ్యాలు వైరస్ల వల్ల వస్తాయి.
అయితే కొందరు వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీ బయోటిక్స్ వేసుకుంటుంటారు. కానీ అది సరికాదు. ఎందుకంటే వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు యాంటీ వైరల్ మందులు వేసుకోవాలి. ఇక ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కూడా వైరసే. కనుక దాన్ని తగ్గించేందుకు వైద్యులు యాంటీ వైరల్ మందులను ఇస్తున్నారు. అయితే ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేస్తే అప్పుడు ఎవరూ భయపడాల్సిన పనిలేదు. దాంతో మనకు కలిగే ముప్పు తప్పుతుంది..!