గత కొంత కాలం కిందటి వరకు ద్విచక్ర వాహనాల్లో కార్బురేటర్ సిస్టమ్‌ను అందిస్తూ వచ్చారు. కానీ బీఎస్6 రాకతో ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు తమ తమ వాహనాల్లో కచ్చితంగా ఫ్యుయెల్ ఇంజెక్షన్ (Fi) సిస్టంను అందించాల్సి వస్తోంది. ఇప్పటికే అనేక కంపెనీలకు చెందిన టూ వీలర్లలో ఈ సిస్టం అందుబాటులో ఉంది. ఇక బీఎస్6 వస్తే అప్పుడు వాహనాల్లో కచ్చితంగా ఈ ఎఫ్ఐ సిస్టంను అందివ్వాల్సిందే. అయితే ఇంతకీ అసలు ఫ్యుయెల్ ఇంజెక్షన్ (Fi) సిస్టం అంటే ఏమిటి ? దాంతో కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎలక్ట్రానిక్ ఫ్యుయెల్ ఇంజెక్షన్ (e-Fi) సిస్టంకు సంక్షిప్త రూపమే ఫ్యుయెల్ ఇంజెక్షన్ (Fi) సిస్టం. సాధారణంగా వాహనాల్లో కార్బురేటర్ సిస్టం ఇంతకు ముందుకు వరకు ఉండేది. కార్బురేటర్ వాహనంలోని ఇంధనాన్ని, బయటి నుంచి గాలిని తీసుకుని రెండింటినీ కలిపి వాహనాన్ని నడిపిస్తుంది. అయితే కార్బురేటర్ కింద ఉండే ఫ్యుయల్ స్క్రూ సెట్టింగ్ ద్వారా ఇంధనాన్ని ఎంత మోతాదులో వాహనం ఉపయోగించుకోవచ్చో మనం సెట్ చేసుకోవచ్చు. అంటే.. వాహనం ద్వారా మనకు మైలేజీ కావాలనుకున్నా లేదా పికప్ ఉండాలనుకున్నా అందుకు అనుగుణంగా ఆ స్క్రూను సెట్ చేసుకోవాలి. దీంతో కార్బురేటర్ ఆ సెట్టింగ్‌కు అనుగుణంగా ఎక్కువ లేదా తక్కువ పెట్రోల్‌ను వాహనం నడిచేందుకు ఉపయోగిస్తుంది. అయితే ఫ్యుయెల్ ఇంజెక్షన్ (Fi) సిస్టంలో ఇలా కాదు. మొత్తం ఎలక్ట్రానిక్ రూపంలో జరుగుతుంది.
ఫ్యుయెల్ ఇంజెక్షన్ (Fi) సిస్టంలో కార్బురేటర్ ఉండదు. అందువల్ల మనం మాన్యువల్‌గా ఫ్యుయల్ స్క్రూను సెట్ చేసుకునేందుకు వీలు లేదు. అయితే ఈ సెట్టింగ్ లేదని మనం విచారించాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఫ్యుయెల్ ఇంజెక్షన్ (Fi) సిస్టం మన వాహనం ఇంజిన్ నడిచేందుకు కావల్సిన పెట్రోల్‌ను, గాలిని సమపాళ్లలో ఆటోమేటిగ్గా మిక్స్ చేస్తుంది. దీంతో ఇంజిన్ స్మూత్‌గా నడుస్తుంది. ఇక ఈ సిస్టమ్ వల్ల ఇంజిన్, ఎగ్జాస్ట్ తదితర భాగాల్లో ఉండే సెన్సార్లు బయటి గాలి, ఇంజిన్ ఉష్ణోగ్రత తదితర అంశాలను లెక్కించి అందుకు అనుగుణంగా ఇంజిన్ నడిచేందుకు అవసరమైన పెట్రోల్, గాలిని మిక్స్ చేస్తాయి. దీంతో బయట చల్లగా ఉన్నప్పుడు బైక్‌ను స్టార్ట్ చేయగానే ఆరంభంలో మొదట ఎక్కువ పెట్రోల్‌ను వాహనం తీసుకుంటుంది. ఆ తరువాత ఇంజిన్ ఉష్ణోగ్రత సరిపడిన విలువకు చేరుకోగానే తిరిగి యథావిధిగా పెట్రోల్, గాలి మిక్స్ అయి ఇంజిన్ నడుస్తుంది. ఇలా ఫ్యుయెల్ ఇంజెక్షన్ (Fi) సిస్టం ద్వారా భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో వాహనం దానంతట అదే తనకు కావల్సిన విధంగా మార్పులు చేసుకుని నడుస్తుందన్నమాట. దీంతోపాటు ఎఫ్ఐ సిస్టం వల్ల వాహనం మైలేజీ, పవర్ కూడా పెరుగుతాయి. అందువల్లే ప్రస్తుతం చాలా మంది ఫ్యుయెల్ ఇంజెక్షన్ (Fi) సిస్టం ఉన్న వాహనాలనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..!