మహిళా దినోత్సవం అంటే…? ప్రత్యేకంగా ఒక రోజు మహిళల కోసం పెట్టుకున్న రోజు అనేది ఎప్పటి నుంచో వింటున్నాం. మహిళలను గౌరవించడానికి, మహిళలను ప్రోత్సహించడానికి, మహిళా శక్తిని గుర్తించడానికి, మహిళలను ముందు ఉండి నడిపించడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అసలు మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా జరుపుకోవాలా…? అంత సీన్ వద్దు గాని, కొన్ని కొన్ని పాటిస్తే చాలు.
కని పెంచిన అమ్మను గౌరవించడం నేర్చుకుంటే, అమ్మను గౌరవించడమే కాదు అమ్మకు మన జీవితంలో ఒక ప్రాధాన్యత ఇస్తే ప్రతీ రోజు అమ్మకు ఉమెన్స్ డే. తోబుట్టువులను కాపాడుకుంటూ వాళ్ళను అన్ని విధాలుగా సక్రమ మార్గంలో ముందుకి నడిపిస్తే… అదే వాళ్లకు నిజమైన ఉమెన్స్ డే. అన్నయ్య, తమ్ముడు, తండ్రి ఇలా ప్రతీ ఒక్కరు ఆడపిల్లకు తోడు ఉన్నప్పుడే నిజమైన ఉమెన్స్ డే.wo
రోడ్డు మీద కనపడిన స్త్రీని నిజంగా స్త్రీగా గౌరవిస్తే ప్రతీ నిమిషం ఉమెన్స్ డేనే. నానమ్మ మాటలు వింటూ, అమ్మమ్మ సలహాలు పాటిస్తూ మన జీవితంలో ఉన్న ప్రతీ స్త్రీకి నిజమైన ప్రాధాన్యత ఇస్తే…? వాళ్ళను నెత్తిన పెట్టుకోకపోయినా, చాదస్తం అనే చేష్ట తో వారిని అవమాని౦చకుండా వారి స్పూర్తితో ముందుకి నడిస్తే…? అదే నిజమైన ఉమెన్స్ డే. అనకూడదు గాని, ఎవరైనా స్త్రీ ఉన్నత స్థానానికి చేరుకుంటే,
మన సమాజం వక్ర దృష్టి తో చూస్తూ ఉంటుంది. ఎం చేసి పైకి వచ్చిందో అంటూ వెనుక ఉండి మాట్లాడతారు. అలా మాట్లాడకుండా వాళ్ళకు ఇచ్చే గౌరవం వాళ్లకు ఇస్తే…? అదే నిజమైన ఉమెన్స్ డే. మన జీవితంలో ఎందరో స్త్రీలు కనపడతారు, వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. ఆఫీస్ కి వెళ్తే స్వీపర్ నుంచి బాస్ వరకు, సినిమాకు వెళ్తే చెకింగ్ నుంచి స్క్రీన్ మీద హీరోయిన్ వరకు, బండి తోలితే బెగ్గర్ నుంచి కారులో వెళ్ళే ఆఫీసర్ వరకు,
ఇంట్లో పని మనిషి నుంచి అమ్మ వరకు, బంధువుల్లో పిన్ని నుంచి మేనత్త వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ స్త్రీ మన జీవితంలో ఏదోక పాత్ర పోషిస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళను వాళ్ళగా గౌరవించడం అనేది నిజమైన ఉమెన్స్ డే. వాళ్ళను వాళ్ళగా చూడటం, వాళ్ళను దిగ జార్చి మాట్లాడకుండా ఉండటమే నిజమైన ఉమెన్స్ డే. స్త్రీ తో కలిసి నడవండి, కాని స్త్రీని అవమాని౦చకుండా ప్రతీ రోజుని ఉమెన్స్ డే గా జరుపుకొండి.