ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజన బిల్లులకు తెలుగు పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు పలికాయి. రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా వైసీపీ, టీఆర్‌ఎస్, టీడీపీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
గత కొద్ది రోజులుగా కాశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న ఉత్కంఠ పరిణామాలకు ఇవాళ్టితో తెర పడింది. కాశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370, 35ఎ లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆర్టికల్ 370, 35ఎ లు రద్దు అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు, పార్టీలు కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నాయి.
ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజన బిల్లులకు తెలుగు పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు పలికాయి. రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా వైసీపీ, టీఆర్‌ఎస్, టీడీపీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, చాలా సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారని ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చాయి. కాగా ఈ బిల్లులతో కాశ్మీరీలకు అభివృద్ధి ఫలాలు పూర్తి స్థాయిలు అందుతాయని ఆయా పార్టీల నాయకులు పేర్కొన్నారు.
కాగా ఈ అంశంపై జాతీయ పార్టీల విషయానికి వస్తే..బీఎస్పీ ఈ నిర్ణయానికి తమ ఆమోదం తెలపగా, కాంగ్రెస్, పీడీపీ, డీఎంకే, ఎస్పీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే బీజేడీ, అన్నాడీఎంకేలు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. అటు టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఆర్‌జేడీ, కేరళ కాంగ్రెస్, జేడీయూలు ఈ బిల్లులను వ్యతిరేకించాయి. కాగా బీజేపీ తమ మిత్రపార్టీ అయినప్పటికీ కాశ్మీర్ విషయంలో తమ ఆలోచన వేరేగా ఉందని జేడీయూ నేత కేసీ త్యాగి అన్నారు. దీంతో రాజ్యసభలో పెట్టిన ఈ బిల్లులకు తాము మద్దతునివ్వడం లేదన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు. మొత్తం మీద చూస్తే మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెజారిటీ వర్గాలైతే సమర్థిస్తున్నాయనే చెప్పవచ్చు..!