గర్భవతులకు వ్యాక్సిన్.. తీసుకునేముందు, తీసుకున్న తర్వాత పాటించాల్సిన జాగ్రత్త….

-

గర్భవతులకు వ్యాక్సిన్ (Vaccine for pregnant women)  తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. గర్భం దాల్చిన మహిళాలకు కరోనా సోకితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున, అదీగాక ఇతరత్రా అనుబంధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆ ముప్పు ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశ్యంలో గర్భవతులకు కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత పాటించాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

వ్యాక్సిన్ తీసుకోవడానికి ఒకరోజు ముందు కావాల్సినన్ని నీళ్ళు తాగండి. మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేట్ చేసుకోండి. అలాగే 8గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. ఇంకా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళే ముందు తేలికపాటి భోజనం చేయండి.

వ్యాక్సిన్ వేసుకునేటపుడు వదులుగా ఉన్న బట్టలని ధరించండి. ముఖ్యంగా చేతులు వదులుగా ఉండేలా చూసుకోండి. అలా అయితే చాలా సులభంగా వ్యాక్సిన్ ఇవ్వవచ్చు.

మీకేమైనా అలర్జీ వంటి ఇబ్బందులు ఉన్నట్లయితే లేదా ఇంతకు ముందు వ్యాక్సిన్ల వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ కనిపించినట్టయితే అక్కడున్న సిబ్బందికి తెలియజేయండి.

వ్యాక్సిన్ కేంద్రంలో ఉన్నప్పుడు కరోనా నిబంధనలు పాటించండి. డబుల్ మాస్క్ ధరించండి. ఉపరితలాలను ముట్టుకోవద్దు. మాస్క్ ముందు భాగాన్ని చేతితో తాకవద్దు. అలాగే భౌతిక దూరం ఖచ్చితంగా పాటించండి.

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 30నిమిషాలు వ్యాక్సిన్ కేంద్రంలోనే ఉండండి. ఎందుకంటే ఏదైనా ప్రతికూల ప్రభావం కనిపిస్తే 30నిమిషాల్లో తెలిసిపోతుంది.

ఇంటికి చేరుకున్న తర్వాత జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి ఇబ్బందులు కనిపించినట్లయితే గైనకాలజిస్టును సంప్రదించి దానికి తగిన పరిష్కారం పొందండి.

ఆ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. కావాల్సినన్ని నీళ్ళు తాగండి.

వ్యాక్సిన్ తీసుకున్న చోట మంటగా ఉంటే హీట్ ప్యాక్ వాడండి. అది మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news