మేము అబద్దాలు చెప్పం.. చేసిందే ప్రజలకు వివరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నిజాంక్లబ్‌లో జరిగిన విశ్వనగరంగా హైదరాబాద్ చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతో కష్టపడి ఆరేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దామన్నారు. పెట్టబడులకు స్వర్గధామం చేశామన్నారు. రూ.67వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కరించామన్నారు. ఆరేళ్లలో ఎం చేశామో ప్రగతి నివేదికలో ఇచ్చామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎం చేసిందో కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరేళ్లలో పన్నుల రూపంలో కేంద్రానికి రూ.2.72లక్షల కోట్లు ఇచ్చామని, కేవలం రూ.1.4లక్షల కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయని చెప్పారు. హైదరాబాద్ రోహింగ్యాలు ఉండే కేంద్రం ఎం చేస్తున్నదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. హైదరాబాద్ పోలీసులు ధైర్యసాహసాలు ఉన్న వారని, శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. భాగ్యనగరంలో అందరూ సమానహక్కులతో బతకాలన్నదే తమ తపన అని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్నది గ్రేటర్ ఎన్నికలని, బిన్‌లాదెన్, బాబర్ చర్చలు ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రతి రోజూ జగడాలు కావాలా.. ప్రశాంత నగరం కావాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు.