ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే తన ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్‌కు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్‌కు తాము యూజర్ల డేటాను ఎలా షేర్ చేస్తాము, ఏయే సమాచారాన్ని సేకరిస్తాము.. అనే వివరాలను ఆ పాలసీల్లో వాట్సాప్ ఉంచింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 8వ తేదీ నుంచి కొత్త పాలసీలను వాట్సాప్ అమలు చేయనుంది. ఆ లోపు ఆ పాలసీలకు వాట్సాప్ యూజర్లు ఒప్పుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్‌ను వారు ఉపయోగించుకోలేరు.
అయితే వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీలపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూజర్ల డేటాకు వాట్సాప్‌లో భద్రత ఉండదని, యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో షేర్ చేస్తామని వాట్సాప్ చెప్పడం సమంజసం కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో వాట్సాప్ పట్ల నెటిజన్లు భగ్గుమంటున్నారు. అయితే దీనిపై వాట్సాప్ స్పష్టతనిచ్చింది.
తాము ప్రవేశపెట్టిన పాలసీ వల్ల యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. వారు ఎప్పటిలాగే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో వాట్సాప్‌లో సేవలను ఉపయోగించుకోవచ్చని, చాటింగ్ చేయవచ్చని తెలిపింది. వారు వాట్సాప్‌ను ఉపయోగించుకునే తీరుపై కొత్త పాలసీల ప్రభావం ఏమీ ఉండదని, కనుక యూజర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని వాట్సాప్ స్పష్టం చేసింది.
ఇక తాము కొత్తగా ప్రవేశపెట్టిన పాలసీల వల్ల వాట్సాప్ బిజినెస్ యూజర్లకు ఎంతో లాభం ఉంటుందని, యూజర్ల డేటాకు అనుగుణంగా ఫేస్బుక్లో వారికి ఉపయోగపడే కంటెంట్‌ను చూపించేందుకు అవకాశం ఉంటుందని, అలాగే వారికి కావల్సిన యాడ్స్ వస్తాయని, దీంతోపాటు వారు ఫేస్బుక్ ద్వారా వాట్సాప్‌లో బిజినెస్ సేవలు పొందవచ్చని, పేమెంట్స్ చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే దీనిపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోకన్నా వాట్సాప్ ఇప్పుడే పెద్ద మొత్తంలో యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో షేర్ చేస్తుందని, అందుకనే కొత్త పాలసీలను ప్రవేశపెట్టిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే వాట్సాప్ కొత్త పాలసీలను ప్రవేశపెట్టినప్పటి నుంచి అందులో నుంచి యూజర్లు టెలిగ్రాం వంటి ఇతర ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌ల వైపు మళ్లుతుండడం విశేషం.