వాట్సాప్‌లో వ‌చ్చేస్తుంది.. పేమెంట్స్ ఫీచ‌ర్‌..!

-

వాట్సాప్‌లో ఇప్ప‌టికే పైల‌ట్ మోడ‌ల్‌లో పేమెంట్స్ లావాదేవీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అతి త్వ‌ర‌లో వాట్సాప్ యూజ‌ర్ల‌కు పేమెంట్స్ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెస్తూ వ‌స్తున్న విష‌యం విదిత‌మే. న‌కిలీ వార్త‌ల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ గ‌తంలో ఎన్నో ఫీచ‌ర్లను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఇక‌పై అందులో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను కూడా యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లో అందివ్వ‌నుంది. అదే.. వాట్సాప్ పేమెంట్స్‌.. నిజానికి ఈ ఫీచ‌ర్‌ను ఎప్పుడో వాట్సాప్ ప్ర‌క‌టించింది. కానీ పలు కార‌ణాల వ‌ల్ల ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేవ‌డం ఆల‌స్యం అయింది. ఇక అతి త్వ‌ర‌లో ఈ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ త‌న యాప్‌లో అందించే పేమెంట్స్ ఫీచ‌ర్‌లో భాగంగా జ‌రిగే యూజ‌ర్ల‌ లావాదేవీలకు చెందిన వివ‌రాల డేటా స్టోరేజ్ క‌చ్చితంగా భార‌త్ లోని స‌ర్వ‌ర్ల‌లోనే ఉండాల‌ని గ‌తంలో ఆర్‌బీఐ వాట్సాప్‌కు తెల‌ప‌గా అప్పుడు వాట్సాప్ ఈ సూచ‌న‌పై స్పందించ‌లేదు. కానీ అదే సూచ‌న‌ను పాటిస్తామ‌ని చెప్ప‌డంతో ప్ర‌స్తుతం వాట్సాప్ పేమెంట్స్‌కు లైన్ క్లియ‌ర్ అయింది. దీంతో వాట్సాప్ లో త్వ‌ర‌లో పేమెంట్స్ సేవ‌లు ప్రారంభం కానున్నాయి.

కాగా వాట్సాప్ భార‌త్‌లో యూపీఐ ఆధారిత సేవ‌ల‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌తో క‌ల‌సి అందివ్వ‌నుంది. ప్ర‌స్తుతం డేటా లోక‌లైజేష‌న్‌, ఆడిట్ ప్ర‌క్రియ జ‌రుగుతుండ‌గా, ఆ ప్ర‌క్రియ నివేదిక‌ను సంబంధిత నియంత్ర‌ణ సంస్థ‌కు అంద‌జేశాక వాట్సాప్ పేమెంట్స్ సేవ‌ల‌ను ప్రారంభించ‌నుంది. అయితే వాట్సాప్‌లో ఇప్ప‌టికే పైల‌ట్ మోడ‌ల్‌లో పేమెంట్స్ లావాదేవీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అతి త్వ‌ర‌లో వాట్సాప్ యూజ‌ర్ల‌కు పేమెంట్స్ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. వాటితో యూజ‌ర్లు ఆన్‌లైన్ న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్‌, బిల్లు చెల్లింపులు చేయ‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news