తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటుగా స్పందించారు. ఆదివారం తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్ధం పడుతోంది అన్న విధంగా ఉద్యోగుల తొలగింపు పేరిట ప్రచురితమైన పేపర్ కటింగ్స్ ను పోస్టు చేశారు. గత రెండ్రోజులుగా బెటాలియన్ పోలీసులు తమకు ఓకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వారితో పాటు వారి భార్యలు సైతం ప్రజాభవన్ వద్ద నిరసనలు చేపట్టారు.
తాజాగా వాటిని ప్రస్తావిస్తూ.. ‘ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని రగిల్చింది ఎవరు ? కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలు కాదా? రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాలు కాదా ? డిజిటల్ సర్వే పేరుతో ఏఈఓల మీద వేటు! పనిభారం మీద ప్రశ్నించినందుకు పోలీసులపై వేటు!.. ఇప్పుడు తెలంగాణ ప్రతి మనిషి ఆలోచిస్తున్నది.. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.