కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు సారథి కోహ్లీ బంగ్లాదేశ్ బౌలర్లపై చెలరేగిపోయాడు. ఈ టెస్ట్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో భారత డేనైట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా కోహ్లీ రికార్డును తన పేరున రాసుకున్నాడు. డే టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన ఘనత లాలా అమర్ నాథ్ పేరున ఉంది. కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకోవడానికి 159 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో 12 బౌండరీలున్నాయి. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ శతకం.
కాగా, భారత జట్టు లంచ్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లీ 130 పరుగులు, రవీంద్ర జడేజా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు భారత జట్టులో చటేశ్వర్ పుజారా 55 పరుగులు, అజింక్య రహానే 51 పరుగులు చేసి జట్టు స్కోరుకు తోడ్పడ్డారు. భారత్ జట్టు ఇప్పటివరకు బంగ్లాపై 183 పరుగుల లీడ్ ను సాధించింది. నిన్న బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.