హైదరాబాద్: త్వరలో మా ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశ్‌రాజ్ పోటీపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. కొత్తగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు మంచు విష్ణు. ఇతను మంచు మోహన్ బాబు తనయుడు. కొన్ని సినిమాలు చేశారు. ఒకటి, రెండు మినహా పెద్దగా హిట్లులేని హీరో. ఇక ప్రకాశ్ రాజ్ ఇండియన్ యాక్టర్. దాదాపు అన్ని బాషల్లో సినిమాలు చేశారు. ప్రకాశ్ రాజ్ తెలుగులో అగ్రహీరోలందరితోనూ సినిమాలు చేశారు. అంతేకాదు ప్రకాశ్ రాజ్ ముక్కు సూటి వ్యక్తి. మా అసోసియేషన్‌లో వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు ఎవరు ఉన్నా విబేధాలు మాత్రం కచ్చితంగా ఉంటాయి. ప్రకాశ్ రాజ్ అయితే బయట వ్యక్తి కాబట్టి వివాదాలకు తావుండవనేది ఒక ఆలోచన. ఇప్పటికే నాగబాబు లాంటి వ్యక్తులు కూడా ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ప్రకటించారు.
ఇక్కడి వరకూ బాగానే ఉన్నా అనూహ్యంగా పోటీలోకి వచ్చిన మంచు విష్ణు విషయంలో సందిగ్ధం నెలకొంది. లోకల్, నాన్ లోకల్ అనే అంశం తెరపైకి వచ్చింది. మంచు విష్ణు లోకల్, ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్. అందుకే మాలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి చిరంజీవి కుటుంబం, మోహన్ బాబు కుటుంబం మధ్య స్నేహం ఇప్పటికాదు. కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి, మోహన్ బాబు కలిసి ఒకే సినిమాలో నటించారు. తర్వాత హీరోలుగా విడివిడిగా నటించారు. మోహన్ బాబు నిర్మాత పలు సినిమాలు రూపొందించారు. ఒకవేళ మోహన్ బాబు వెళ్లి చిరంజీవిని మద్దతు కోరితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒక చర్చ. అంతేకాదు అందరి దృష్టి ప్రధానంగా దీనిపైనే ఉంది.
కానీ అసలు విషయం వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని కొత్తగా వినిపిస్తోన్న మాట. మంచు విష్ణు వెనుక ఓ అదృశ్య శక్తి ఉందని ప్రచారం జరుగుతోంది. మంచు విష్ణు సినిమాల్లో హీరోనే అయినా.. ఆయన ఏపీకి చెందిన ముఖ్య వ్యక్తికి బంధువు కూడా. ఆ ముఖ్య వ్యక్తి అక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఏది చేసినా తిరుగే లేదు. మంచు విష్ణును సినిమాల్లో మాత్రమే చూడొచ్చు. కానీ ఆ అదృశ్య శక్తిని రియల్ తెరపై ప్రతి రోజూ చూడాల్సిందే. అటువంటి వ్యక్తి మద్దతు విష్ణుకు ఉందని వినిపిస్తోంది. అంతేకాదు అసలు అక్కడి నుంచే ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. మంచు విష్ణు గెలిస్తే ‘మా’చిత్రంలో పూర్తి ఆధిపత్యం తమ చేతుల్లోకి తీసుకోవచ్చని భావిస్తున్నారట.
ఇప్పటివరకూ టాలీవుడ్‌లోగానీ, ‘మా’లో గాని రెండు సామాజిక వర్గాలదే పై చేయి. తొలి నాళ్ల నుంచి వాళ్లే మాలో రాజ్యమేలుతున్నారు. వాళ్లు కాకుండా ఇంకెవరూ లేరు. ఇది అక్షర సత్యం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ కాదనలేని విషయం కూడా. ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాలపై పట్టు సాధించాలంటే ఆ రెండు సామాజిక వర్గాల వ్యక్తులనే పావులుగా ఉపయోగించాలి. లేదా ఓ సామాజిక వర్గంపై పట్టు సాధించాలన్న మిగిలిన సామాజిక వర్గం చెందిన వ్యక్తినే ఉపయోగించాలి. ఎందుకంటే ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలే అక్కడ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇప్పుడు మంచు విష్ణు విషయంలో కూడా అదే జరుగుతోందని కొందరి భావన. ‘‘మంచు విష్ణు మా ఎన్నికల్లో గెలిస్తే పూర్తి ఆదిపత్యం చెలాయించొచ్చు. గతంలో జరిగిన పరిణామాలపై ప్రతీకారం తీర్చుకోవచ్చు. చెప్పిన మాట వింటే సరే..లేదంటే అంతే. పైగా ‘మా’లో అవినీతి మరకలు ఉన్నాయి. అవకతవకలు ఉన్నాయి. వీటినుపయోగించే మెడలు ఒంచొచ్చు.’’అనేది ఆ అదృశ్య శక్తి ఆలోచనగా కొందరి మనసుల్లో నలుగుతున్న ప్రశ్నలట.
ఎవరి అనుమానాలు వాళ్లకున్నప్పటికి… మంచు విష్ణు గెలిస్తే కొన్ని అడ్వాంటేజులు ఉంటాయనేది ‘మా’లో మరికొందరనుకుంటున్న మాట. మంచు విష్ణుకు తండ్రి మోహన్ బాబు ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఏపీ, తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి సహాకారం అందుతుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.