వ్యాది సోకిన మొదటి వ్యక్తి ‘‘ పేషెంట్‌జీరో ’’.. చైనాలో అసలు కరోనా ‘పేషెంట్‌ జీరో’ ఎవరు.?

-

ఈ విషయంలో చైనా దాపరికాలు, మాట మార్చడాలు ప్రపంచాన్ని అతిపెద్ద ప్రమాదంలోకి నెట్టివేసాయి. ఇప్పటికే దేశాలు, శాస్త్రవేత్తలు, నిపుణుల వేళ్లు చైనా వైపే చూపిస్తున్న నేపథ్యంలో, ‘‘ఫాక్స్‌ న్యూస్‌ ’’ బయటపెట్టిన సంచలన విషయాలు నిజమే అయితే, చైనా భారీమూల్యం చెల్లించాల్సివస్తుంది.

పేషెంట్‌ జీరో –  ఏదైనా సంక్రమణ వ్యాధి ప్రజలకు సోకినప్పుడు, మొట్టమొదటగా సోకిన వ్యక్తిని ‘‘ పేషెంట్‌జీరో ’’ గా వ్యవహరిస్తారు.

సంక్రమణ వ్యాధులకు మందు తయారుజేసే క్రమంలో ఈ పేషెంట్‌జీరో చాలా కీలకం. ఎందుకంటే వ్యాధి మొదటగా ఒక వ్యక్తికి సోకినప్పుడు మందులేవీ ఉండవు. తనకు ఎలా చికిత్సనందించాలో వైద్య వర్గాలకు తెలిసే అవకాశం ఉండదు. అప్పుడు ఆ వైరస్‌కు ఎదురుండదు. క్రమంగా రోగి శరీరంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో? ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో పరిశీలించినప్పుడే వైరస్‌ ప్రవర్తన, వృద్ధి అర్థమవుతాయి. అందుకని ఆ పేషెంట్‌ జీరో పరిశోధనల్లో చాలా ముఖ్యం. ఇప్పుడు కరోనా విజృంభణకు మందు కనుక్కోవాలంటే ఆ రోగి ఎవరో ఖచ్చితంగా తెలిసితీరాలి.

కానీ, చైనా తన చెప్పాలనుకున్నదే చెబుతోంది. డిసెంబర్‌ 10, 2019న వుహాన్‌లోని చేపల మార్కెట్లో, రొయ్యలమ్ముకునే ఒక మహిళ (57)కు కరోనా సోకినట్లు గుర్తించినట్లు చైనా ప్రకటించింది. అక్కడ గబ్బిలాలు కూడా అమ్ముతారు కాబట్టి, ఆమెకు అలా గబ్బిలాల ద్వారా సోకిందని చైనా ఉవాచ. వీ గుజియాన్‌ అనే ఆ మహిళే ‘పేషెంట్‌ జీరో’ అని చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది. ఆమె నుండే కరోనావైరస్‌ క్రమంగా వ్యాపించిందనేది తెలిపిన చైనా, జనవరి 2 నాటికే తాము కరోనావైరస్‌ జన్యుక్రమాన్ని గుర్తించి, ప్ర.ఆ.సం. కు అందజేసామని చెప్పింది. అయితే, విచిత్రంగా ఎటువంటి కరోనా ప్రత్యేక చికిత్స తీసుకోని పేషెంట్‌జీరో, క్రమంగా కోలుకుని, ఇంటికి వెళ్లిపోయింది. ఇక్కడే, ప్రపంచ వైరాలజీ నిపుణులకు సందేహం మొదలైంది. ఇది అసాధ్యం కదా… అనే మీమాంస క్రమంగా దేశాధినేతలకు కూడా చేరింది.

చైనా వుహాన్‌లో కరోనా సోకినవారి సంఖ్య కూడా చాలా తక్కువగా చూపిస్తోంది. మొదట్లో దీని గురించి హెచ్చరించిన డాక్టర్లు, జర్నలిస్టులు కనబడకుండా పోయారు. అన్ని సందేహాలకు మూలకారణం, ఆసియాలోనే అతిపెద్దదైన వైరాలజీ కేంద్రం వుహాన్‌లోనే ఉంది. ఇక్కడున్న బయో సేఫ్టీ లెవెల్‌-4 ల్యాబొరేటరీలోనే అతి భయంకరమైన 1500 రకాల వైరస్‌లు భద్రపరచబడి ఉన్నాయి. వీటిపై రకరకాల పరిశోధనలు అక్కడ రోజూ జరుగుతూంటాయి. కాబట్టి, కరోనావైరస్‌ అక్కడే పుట్టిందనే వాదన క్రమంగా మొదలై, ఉధృతస్థాయికి చేరింది. కరోనావైరస్‌ను కావాలనే చైనా తయారుచేసిందనీ, జీవాయుధంగా మార్చడానికి ప్రయత్నించిందనీ ఆరోపణలు మొదలయ్యాయి.  మొదట దీన్ని నిర్లక్ష్యం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, పరిస్థితి తీవ్రతను అంచనా వేయలేక తన దేశాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. తనకున్న కారణమేదైనా, ఇంత భారీ ప్రాణ, ఆర్థిక నష్టానికి చైనాయే హేతువని తేలితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో క్షమించేది లేదని డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించాడు. చాలా దేశాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి.

అయితే, అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాచానెల్‌, ‘‘ ఫాక్స్‌ న్యూస్‌ ’’ ఓ బాంబు పేల్చింది. తన పరిశోధనలో తేలిన నిజాలను బయటపెట్టింది.

పేషెంట్‌ జీరో… మార్కెట్లోన మహిళ కాదని, వుహాన్‌ ల్యాబ్‌లో ఇంటర్న్‌గా పనిచేసే ఓ అమ్మాయని తెలిపింది. అంటే, SarS Covid-2 ( కరోనావైరస్‌) ఇంతకుముందే ఆ ల్యాబ్‌లో ఉందని, పొరపాటున ఆ అమ్మాయి ఆ కంటెయినర్‌ సీల్‌ పగులగొట్టడంతో ఆ వైరస్‌ అమ్మాయికి సోకిందని ‘ఫాక్స్‌న్యూస్‌’ తెలిపింది. ఆ ఉద్యోగిన ద్వారా ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు, ఆ అబ్బాయి వుహాన్‌లోకి మార్కెట్‌కు వెళ్లడం వల్ల మార్కెట్‌లో వ్యాపించిందని ప్రకటించింది. గబ్బిలాల ద్వారా వ్యాపించిందని చైనా చెప్పడం అబద్ధమని, వుహాన్‌ మార్కెట్లో అసలు గబ్బిలాలనే అమ్మరని  ఆ చానెల్‌ స్పష్టం చేసింది. చైనీయులు గబ్బిలాల సూప్‌ను చాలా ఇష్టంగా తాగుతారట. కానీ ఇక్కడ మాత్రం అవి కారణం కాదని, వీటన్నింటికీ తమ దగ్గర రాతపూర్వక ఆధారాలున్నాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news