ఎప్పటిలాగే దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించినా, కాంగ్రెస్ వైపు ఓటర్ల మొగ్గు చూపించలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014లో కాంగ్రెస్ అధికారం దక్కించుకుందని అంత అభిప్రాయపడగా, ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసింది. తర్వాత పార్టీని బలోపేతం చేసే విషయంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దృష్టి పెట్టకుండా, గ్రూపు రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో కాంగ్రెస్ మరింత దిగజారి పోయింది. ఇక 2018 ఎన్నికల్లోనూ ఇదే విధమైన వైఖరితో ముందుకు వెళ్లడం తో మళ్లీ అవే చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు, తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా , తమ ఖాతాలో ఓటమిని వేసుకోవడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిపోయింది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో , తెలంగాణలో బలపడే విషయంపై దృష్టి సారించకుండా, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేందుకు, వేరే వారి నాయకత్వంలో పనిచేసేందుకు ఇష్టపడకపోవడం వంటి ఎన్నో కారణాలతో కాంగ్రెస్ జనాల్లో నమ్మకం కలిగించలేక పోయింది.దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి బలమైన అభ్యర్థి అయినా, శ్రీనివాస్ రెడ్డి తండ్రి చెరుకు ముత్యంరెడ్డి నియోజకవర్గంలో బలమైన వ్యక్తిగా ముద్ర వేయించుకున్న అవేవీ కాంగ్రెస్ ను కాపాడలేకపోయాయి.అసలు దుబ్బాక ఉప ఎన్నికల మొదట్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంతా అభిప్రాయపడ్డారు. కానీ బిజెపి బలం పుంజుకోవడం, ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కు సానుభూతితో పాటు, ఆ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉండడం ఇవన్నీ మేలు చేశాయి.
త్వరలో జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపించక పోవడంతో , ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు పై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు బీజేపీ వైపు ఉండేలా కనిపిస్తుండడంతో, కాంగ్రెస్ ను కాపాడేది ఎవరు ఎవరు అనే ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి.
-Surya