ఆరోగ్య శ్రీ పై ఏపీ సర్కార్ మరో ముందడుగు

-

ఆరోగ్య శ్రీకి సంబంధించి మరో కీలక ముందడుగు వేసింది ఏపీ సర్కార్. ఆస్పత్రిలో వెయ్యి రూపాయల బిల్లు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పోస్ట్‌ కరోనా ట్రీట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పరిధిలో చేరుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీలో ఆసుపత్రిలో చేరి వెయ్యి రూపాయల బిల్లు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు మిగిలిన శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది ఏపీ సర్కార్.

దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన రాష్ట్రం ఆంధ్రపదేశ్ అన్నారు సీఎం జగన్. ఇప్పుడు కరోనా తర్వాత అందించే చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నట్లు ప్రకటించారు. పోస్ట్ కరోనా సదుపాయాలన్నీ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే ఏ లబ్ధిదారుడైనా ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు పూర్తిబాధ్యత ప్రభుత్వానిదే అన్నారు సీఎం జగన్.ఇప్పటివరకు 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 234 వ్యాధులను చేర్చారు. దీంతో మొత్తం 2 వేల 434 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. ఆస్పత్రి బిల్లు వెయ్యి రూపాయలు దాటితే బిల్లు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news