ఓ వైపు కరోనా కేసులు.. మరో వైపు స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా నిష్క్రమణ.. వెరసి ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ టీంను కష్టాలు చుట్టు ముట్టాయి. అయితే కొద్ది రోజులు ఓపిక పడితే ఎలాగో కరోనా గండం నుంచి గట్టెక్కవచ్చు. కానీ తరువాత ప్రారంభయ్యే టోర్నీ గురించే ఇప్పుడు చెన్నై జట్టు ఆందోళన చెందుతోంది. ఎందుకంటే.. సురేష్ రైనా చెన్నై టీంలో ఇప్పటి వరకు నం.3 స్థానాన్ని విజయవంతంగా భర్తీ చేస్తూ వచ్చాడు. చెన్నై తరఫున 2008 నుంచి ఆడుతున్న అతను టీంలో తిరుగులేని ప్లేయర్‌గా ఎదిగాడు. అయితే ఇప్పుడు రైనా లేని లోటు ఆ జట్టును కలవరానికి గురి చేస్తోంది.
చెన్నై టీంలో రైనా తిరుగులేని ప్రదర్శన చేశాడు. చెన్నై తరఫున అత్యధిక రన్స్ చేసింది రైనానే. చెన్నై టీంకు ఆడిన రైనా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 4527 పరుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మన్ గా కూడా రైనా రికార్డు సృష్టించాడు. అతని పేరిట 5368 ఐపీఎల్ రన్స్ ఉన్నాయి. అలాగే జట్టును అనేక సార్లు ఆదుకున్నాడు. బౌలింగ్‌లోనూ రాణించగలడు. ఈ క్రమంలో రైనా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు చెన్నై టీంలో లేడనే చెప్పాలి. కానీ రైనా ఇప్పుడు లేడు కనుక.. ఆ టీం ప్రస్తుతం అతని స్థానాన్ని మరో మెరుగైన ప్లేయర్‌తో భర్తీ చేయాలని ఆలోచిస్తోంది. అందుకు ఆ టీం వద్ద పలు ఆప్షన్లు కనిపిస్తున్నాయి.
మురళీ విజయ్ చెన్నై టీంలో నం.3 బ్యాట్స్‌మన్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయ్ కి రైనా అంత ఎక్స్‌పీరియెన్స్ ఉంది. కానీ రైనాలా హిట్ బ్యాట్స్ మన్ కాదు. అయినప్పటికీ టీ20లలో నిలబడి ఆడగలడు. అందువల్ల చెన్నై టీం మురళీ విజయ్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా రైనా స్థానాన్ని భర్తీ చేస్తాడని చెన్నై ఆశిస్తోంది. రుతురాజ్ ఇండియా ఎ స్క్వాడ్ తరఫున అద్భుతంగా ఆడాడు. అదే ప్రదర్శనను ఐపీఎల్‌లోనూ కొనసాగించేందుకు అవకాశం ఉంది.
ఇక నం.3 బ్యాట్స్ మన్ ఎవరూ లేకపోతే కెప్టెన్ ధోనీయే స్వయంగా ఆ స్థానంలో బరిలోకి దిగుతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. టీమిండియాకు ధోనీ ఆ ప్లేస్‌లో వచ్చి ఆడి ఎన్నో విజయాలను అందించాడు. అందువల్ల ఆ ప్లేస్‌లో ధోనీ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక ధోనీ కాకుండా డుప్లెసిస్ కూడా నంబర్ 3 లో రాణించగలడు. మరి ఈ బ్యాట్స్‌మెన్లలో ఆ స్థానంలో ఎవరు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే ఐపీఎల్ ఆరంభం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.