జగన్ అంటే.. ఆ మంత్రికి పంచప్రాణాలు. వైఎస్ కుటుంబం అంటే.. అంతులేని ప్రేమ. చేతిపైనా వైఎస్సార్ అనే పచ్చబొట్టు వేయించుకున్న మహిళా నాయకురాలు. ఈ క్రమంలోనే జగన్ ఆమెకు ఎవరూ ఊహించని పదవి ఇచ్చారు. డిప్యూటీ సీఎంను చేశారు. ఆమే.. డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. కురుపాం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె వరుస విజయాలకు తోడు.. టీడీపీ నుంచి గతంలో వచ్చిన ఆఫర్లను కూడా కాదని పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఈ పరిణామాలే జగన్ ఆమెకు మంచి పోస్టు ఇచ్చేలా చేశాయని అంటారు. ఇక, డిప్యూటీ సీఎంగా ఉంటూనే జగన్‌పై కొన్ని టిక్ టాక్ చేసి.. పోస్టు చేశారు. విమర్శలు వస్తాయని తెలిసి కూడా వెరవకుండా ముందుకు సాగారు. అదేసమయంలో మంత్రిగా కూడా దూకుడుగా ఉండేవారు. అయితే, ఇటీవల రెండు మూడు మాసాలుగా మాత్రం ఆమె మౌనం వహిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఆమె మౌనం వహిస్తున్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
సొంత కుటుంబంలో ఆమె మామగారు.. మీడియా ముందుకు వచ్చి.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జగన్ పాలన ఏకపక్షంగా ఉందని, డబ్బులు పంచడంతో తిరిగి అధికారంలోకి రావాలని ఆయన భావిస్తున్నారని, ఇది సుతరామూ తప్పని ఆయన విమర్శించారు. ఇది జరిగి నాలుగు నెలలు గడిచిపోయాయి. ఈ విషయంలో పుష్ప శ్రీవాణి స్పందించలేదు. దీనిపై జగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్..?
ఇక, జిల్లాల విభజన విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు. అయితే, వీటిని జగన్ తిరస్కరించారు. ఇది కూడా మంత్రి మౌనానికి కారణమని అంటున్నారు. అదే సమయంలో జిల్లాలోనూ ఆమెది పైచేయి కాకుండా.. ఒకరిద్దరు నాయకులే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాకే చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఇక తన నియోజకవర్గంలో తనను ఇబ్బంది పెట్టేందుకే జడ్పీ మాజీ చైర్మన్ శోభా స్వాతిరాణిని పార్టీలోకి తీసుకు వచ్చారని కూడా ఆమె సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె తన మానాన తను పనిచేసుకుంటున్నారని.. ముభావంగా ఉంటున్నారని తెలుస్తోంది.