ఒక పక్క కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులు పడుతుంది. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడానికి ఇష్టపడటం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఎవరిని బయటకు రాకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తో అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆయన కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇటీవల ఆయన కొందరు వైద్యులను సస్పెండ్ చేసారు అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ రావు ని సస్పెండ్ చేయడం వివాదాస్పద౦ అయింది. అదే విధంగా నగిరి మున్సిపల్ కమీషనర్ వెంకటరామి రెడ్డి ని సస్పెండ్ చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. వీళ్ళు మాస్క్ లు ఇతర రక్షణ కవచాలు లేవు అనే ఆరోపణలను సోషల్ మీడియాలో చేసారు. దీనిపై సర్వత్రా ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాళ్లకు అన్ని సౌకర్యాలను కల్పించకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇది పక్కన పెడితే తాజాగా రమేష్ కుమార్ ని తప్పించడానికి సిద్దమయ్యారు. ఆయన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్నారు. ఆయన్ను తప్పించడానికి ఒక ఆర్డినెన్స్ ని కూడా తీసుకు రావడానికి గాను జగన్ సర్కార్ సిద్దమైంది. ఈ నిర్ణయాలు ఇప్పుడు అవసరం లేదు. కరోనా ఉన్న సమయంలో ప్రజలకు సాంత్వన కలిగించే నిర్ణయాలు తీసుకోవాలి. కక్షలు ఏమైనా ఉంటే తర్వాత తీర్చుకోవాలి గాని ఇప్పుడు తీసుకుంటే మాత్రం అనవసరంగా ప్రజల్లో చులకన అయ్యే అవకాశాలు ఉంటాయని పలువురు హెచ్చరికలు చేస్తున్నారు.