నీ వెంటే నేను అంటూ.. భర్త మరణ వార్త విని భార్య మృతి

-

పెళ్లైన నాటి నుంచి ఆ ఇద్దరు కలిసి బతికారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఆమె పెళ్లైనప్పటి నుంచి తన భర్తను విడిచి ఎన్నడూ లేదు. ఈ విషయం దేవుడికి కూడా అర్థమైందేమో అందుకే.. ఇద్దర్నీ ఒకేసారి తన వద్దకు పిలిచాడు. భర్త మరణ వార్త విన్న భార్య హఠాన్మరణానికి గురైంది. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

లింగంపేట్​ మండలం షెట్​పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన పెండా రాజయ్య(61), లచ్చవ్వ(54) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం రాజయ్య ఛాతిలో నొప్పి వస్తుందని కుమారులకు చెప్పాడు. వెంటనే కుమారులు తండ్రిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటుకు గురై ద్విచక్రవాహనంపైనే ఆయన ప్రాణాలు విడిచారు.

మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా భార్య లచ్చవ్వ గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో అప్పటివరకు అన్యోన్యంగా కలిసి జీవించిన దంపతులు ఒకేసారి ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవడంతో పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. భార్యాభర్తల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news