గుజరాత్‌లోని వడోదరాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత ఓ మహిళ తన భర్త మగాడు కాదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంపై ఫిర్యాదు ఇవ్వడంపై పోలీసులు విస్మయం చెందారు. కానీ అసలు విషయం తెలుసుకుని.. కేసు నమోదు చేసుకుని మహిళ భర్తను అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే..?
గుజరాత్ వడోదరాలో ఓ మహిళ తన భర్త పురుషుడే కాదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ భాగాలకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తనకు తెలియకుండా దాచినట్లు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసహజ శృంగారం, మోసం అభియోగాల కింద బాధితురాలి భర్తపై గత బుధవారం గోత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విషయం దాచి పెళ్లి చేసినందుకు అత్తింటివారి పేర్లు కూడా ఆమె ఫిర్యాదులో చేర్చారు.
వివాహ సంబంధాల వెబ్‌సైటు ద్వారా పరిచయమైన వీరిద్దరికీ 2014 ఫిబ్రవరిలో వివాహమైంది. హనీమూన్ కోసం కశ్మీర్‌కు కూడా వెళ్లారు. చాలా రోజులపాటు తనకు దూరంగా ఉంటూ సాకులు చెబుతున్న భర్తను ఆమె నిలదీయగా.. రష్యాలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా తాను శృంగార సామర్థ్యం కోల్పోయినట్లు సమాధానం వచ్చింది.
ఆ తర్వాత 2020లో పొట్ట తగ్గేందుకు సర్జరీ అని కోల్‌కతాకు వెళ్లిన తన భర్త.. పురుష అవయవాల కోసం శస్త్రచికిత్స చేయించుకున్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెతో అసహజ శృంగారం ప్రారంభించిన అతడు ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ భర్తను దిల్లీలో అరెస్టు చేసి.. వడోదరాకు తీసుకువచ్చినట్లు గోత్రి పోలీసులు వెల్లడించారు.