‘ఫ్యాన్’ పాలిటిక్స్: బాలయ్యకు జగన్ హ్యాట్రిక్ ఛాన్స్ ఇస్తారా?

-

హిందూపురం…ఈ పేరు చెబితే మొదట గుర్తొచ్చేది నందమూరి ఫ్యామిలీ. తెలుగుదేశం ఎప్పుడైతే ఆవిర్భవించిందో….అప్పటినుంచి హిందూపురంలో మరో పార్టీ జెండా ఎగిరిన సందర్భం లేదు. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే…ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ టి‌డి‌పి జెండా ఎగురుతూనే వచ్చింది. అలాగే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణలు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు.

అయితే గత రెండు పర్యాయాలుగా బాలయ్య హిందూపురం నుంచి గెలుస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య చూస్తున్నారు. కానీ బాలయ్య హ్యాట్రిక్‌ని అడ్డుకోవాలని అధికార వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పంచాయితీ, మున్సిపాలిటీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ సత్తా చాటింది. ఎప్పుడూలేని విధంగా టి‌డి‌పి ఓటమి పాలైంది. దీంతో నెక్స్ట్ బాలయ్యకు గెలిచే ఛాన్స్ ఇవ్వమని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.

ఇప్పటికే హిందూపురంలో బాలయ్య సీన్ అయిపోయిందని, ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాలని వైసీపీ నేత ఇక్బాల్ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అనేది జరగని పని…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం బాలయ్యకు చెక్ పెట్టేస్తానని ఇక్బాల్ మాత్రం గట్టిగా చెబుతున్నారు. అయితే కంచుకోటలో బాలయ్యకు చెక్ పెట్టడం అంత సులువైన పనా? అంటే కాదనే చెప్పాలి. ఇక్కడ బాలయ్యకు ప్రజల మద్ధతు ఎక్కువగానే ఉంది.

2019 ఎన్నికల్లో అలాగే బాలయ్య ఓడిపోవడం ఖాయమని, అసలు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండటం లేదని, అభిమానులని కొడుతున్నారు…తిడుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఎంత జరిగినా మళ్ళీ బాలయ్య మంచి మెజారిటీతో గెలిచారు. ఇక అందుబాటులో లేకపోయినా సరే పనులు మాత్రం చేయిస్తారు. కాబట్టి హిందూపురంలో బాలయ్య సత్తా తగ్గిందని చెప్పలేం. అదే సమయంలో జగన్ సైతం బాలయ్యని ఎక్కువ టార్గెట్ చేసినట్లు ఉండరు. అంతకముందు జగన్…బాలయ్య అభిమాని కావడంతోనే రాజకీయంగా హిందూపురంపై పెద్దగా ఫోకస్ చేసినట్లు కూడా కనబడరు. అలాగే రాజకీయంగా ఎలాంటి విమర్శలు కూడా చేయరు. మరి ఇలాంటి పరిస్తితి చూస్తుంటే హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్‌కు పెద్ద ఇబ్బంది ఉండదనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news