పార్టీ మారి అదృష్టం పరీక్షించుకోవాలంటున్న కేంద్రమాజీ మంత్రి…!

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ఆ కేంద్ర మాజీ మంత్రి అనుకుంటున్నారా? ఇందుకోసం పార్టీ మారి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారట..పనబాక లక్ష్మి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఏపీ విభజన తర్వాత పార్టీమారిన అనేకమంది కాంగ్రెస్‌ నేతల జాబితాలో చేరి.. టీడీపీ కండువా కప్పుకొన్నారామె. 2019లో తిరుపతి లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగినా లక్‌ కలిసి రాలేదు.

తిరుపతిలో ఓడిన తర్వాత కనిపించకుండా పోయారు పనబాక. అటు టీడీపీతోనూ టచ్‌లో లేరు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో జరిగే ఉపఎన్నికతో పనబాక లక్ష్మి పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ ఉపఎన్నిక బరిలో ఉండబోమని మొదట్లో సంకేతాలు ఇచ్చిన టీడీపీ ఆ తర్వాత మనసు మార్చుకుంది. పోటీలో ఉంటామని ప్రకటించింది. అయితే పనబాకకు టీడీపీ టికెట్‌ ఇస్తారో లేదో తెలియదు. కానీ.. ఆమె మాత్రం పక్క చూపులు చూస్తున్నారని సమాచారం.

బీజేపీలో చేరి తిరుపతి ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారట పనబాక లక్ష్మి. ఈ దిశగా ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు టాక్‌. కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో ఢిల్లీలో బీజేపీ నాయకులతో తనకున్న పరిచయాలతో కమలం శిబిరంలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు.