హుజూర్‌న‌గ‌ర్‌లో టీడీపీ పోటీ చేస్తుందా.. అభ్య‌ర్థి ఎవ‌రంటే..?

-

తెలంగాణ రాజకీయాల్లో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. రాజ‌కీయ పార్టీల‌న్నీ ఇక్క‌డే తిష్ట‌వేస్తున్నాయి. ప్ర‌తీ పార్టీ ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. అయితే.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలిచి, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌ని చూపించుకోవాల‌ని చూస్తోంది. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేయాల‌ని కాంగ్రెస్ పార్టీ ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన పాజిటివ్ వేవ్‌ను కొన‌సాగించాలంటే.. ఈ ఉప ఎన్నిక‌లో స‌త్త‌చాటాల్సిన అవ‌స‌రం బీజేపీ ముందుంది.

ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు… అది కూడా పీసీసీ అధ్య‌క్షుడు రాజీనామా చేసిన సీటు కావ‌డంతో ఆ పార్టీకి ఇది చాలా ప్ర‌తిష్టాత్మ‌కం. ఇక పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో షాక్ నుంచి కోలుకుని స‌త్తా చాటేందుకు టీఆర్ఎస్‌కు ఇది సువ‌ర్ణావ‌కాశం. ఇక్క‌డే మ‌రొక ట్విస్ట్ ఉంది. ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ కూడా బ‌రిలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గెల‌వ‌కున్నా కూడా.. ఉనికిని చాటుకోవాల‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. కొద్దిరోజుల కింద‌ట హైద‌రాబాద‌ర్‌లో టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టీటీడీపీ నేత‌ల‌తో స‌మావేశం కావ‌డం.. తెలంగాణ‌లో పార్టీకి పూర్వ‌వైభ‌వం తీసుకురావ‌డానికి ప్ర‌తీ కార్య‌క‌ర్త కృషి చేయాల‌ని పిలుపునివ్వ‌డం.. తెలంగాణ‌లో టీడీపీని కాపాడుకోవ‌డం చారిత్ర‌క అవ‌స‌ర‌మని చెప్ప‌డం.. తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఒంట‌రిగానే పోటీ చేసి, టీడీపీ స‌త్తాచాటాల‌ని, టీడీపీని వీడింది నాయ‌కులేన‌ని, కార్య‌క‌ర్త‌లు అలాగే ఉన్నార‌ని చెప్ప‌డ‌మే వ్యూహంగా ముందుకు వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఇప్ప‌టికీ ఏ పార్టీ అభ్య‌ర్థికి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని స‌మాచారం. అయితే.. దీనిపై టీటీడీపీ నాయ‌కుల్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవ‌సరం ఉంది. ఒక‌వేళ పోటీ చేస్తే ఎవ‌రికి బ‌రిలోకి దించాల‌న్న‌ది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక్క‌డ మ‌రొక వ్యూహం కూడా క‌నిపిస్తోంది. ముందుస్తు ఎన్నిక‌ల్లో టీడీపీ-కాంగ్రెస్ క‌లిసి బ‌రిలోకి దిగి దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే ఒంట‌రిగా బ‌రిలోకి దిగి.. టీడీపీ స‌త్తాచాటాల‌ని.. ఇక్క‌డ గెల‌వ‌డం కాద‌ని, తెలంగాణ‌లో టీడీపీ బ‌తికే ఉంద‌ని చూపించ‌డ‌మే నాయ‌కుల ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. అయితే.. టీడీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేక చేతులు ఎత్తేసిన టీడీపీ ఇక్క‌డ పోటీ చేస్తే అది కామెడీయే అవుతుందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఈ నేప‌థ్యంలో హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇలా అన్ని పార్టీల‌కు హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ఒక ఛాలెంజ్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news