రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో పాల్గొన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా భారత్ జోడో పాదయాత్రలో అనుభవాలను వివరించారు. దేశంలో ప్రధానంగా నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతుల సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అగ్ని వీర్ యోజన సైనికుల నుంచి వచ్చిన ఆలోచన, ప్రతిపాదన కాదని.. ఈ ఆలోచన, ప్రతిపాదన జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ దేనని అన్నారు.
ఇక ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం అదాని గురించే చర్చ జరుగుతుందన్నారు. అదాని ప్రతి వ్యాపారంలో దూరిపోతారని, అందులో విజయం కూడా సాధిస్తారని అన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్తులు, రోడ్లు.. ఇలా ప్రతిదీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశం మొత్తం ఆదానికి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. హిండెన్బర్గ్ రిపోర్ట్ పై మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
అదాని షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోదీకి ఉందా? అని ప్రశ్నించారు. 2014లో 8 బిలియన్ డాలర్ల ఆదాని వ్యాపార సామ్రాజ్యం 2022లో 140 బిలియన్ డాలర్లకి మారిపోయిందన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో 2014లో 609 వ స్థానంలో ఉన్న అదాని.. 2022లో రెండవ స్థానానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. మోడీ, ఆదాని సంబంధం ఇప్పటిది కాదని. చాలా పాతదని అన్నారు.