తెలంగాణకు అలెర్ట్.. రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత..

తెలంగాణను చలి వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతోంది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలం వరకు ఏపీలో వాయుగుండం, అల్పపీడనాలతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మామూలుగానే ఉన్నాయి. దీంతో ఈ శీతాకాలం ఇంత వరకు చలి తీవ్రత పెద్దగా లేదు.

ప్రస్తుతం ఈశాన్య, వాయవ్య భారత్‌ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. దీంతో పాటు గాలిలో తేమ శాతం సాధారణం కన్నా 25 శాతం ఎక్కువైంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలికి గజగజ వణుకుతోంది. కుమ్రం భీం జిల్లాలో 10.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 10.5 డిగ్రీలు, నిర్మల్ లో 12.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో కూడా  ఇదే పరిస్థితి ఉంది.