గర్భ సంచి లేకుండా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

16సంవత్సరాల వయసులో ఉన్న అమందా గ్రునెల్ తన శరీరంలో ఏదో అపశృతి ఉందని భావించింది. వయసు పెరుగుతున్న రుతుక్రమం జరగట్లేదని గుర్తించిన తల్లిదండ్రులు వైద్యుడిని సంప్రదించారు. గర్భసంచి లేకుండా అమందా పుట్టిందని, దానివల్ల ఆమెకి జీవితంలో పిల్లలు పుట్టరని డాక్టర్లు తెలియజేసారు. 17సంవత్సరాల వయసులో అమందాకి ఈ విషయం అర్థమైంది. కాకపోతే గర్భాశయ మార్పిడి గురించి అప్పుడే వార్తలు విన్నది.

కాలం గడుస్తూ ఉంది. అమందాకి 32ఏళ్ళు. ఈ సమయంలో పిల్లలు కనాలన్న ఆలోచన అమందాకి కలిగింది. అందుకే క్లీవ్ లాండ్ గర్భాశయ మార్పిడి క్లినిక్ ని సంప్రదించింది. ఈ విషయంలో అమందా స్నేహితులు, భర్త జాన్, ఆమె తల్లి అందరూ సహకరించారు. అమందాకి పిల్లలు కలగాలని అందరూ ప్రార్థించారు. ఐతే అమందా తల్లికి క్యాన్సర్ అని తేలింది. అప్పుడు అమందా తల్లి, నీకు బిడ్డ పుడితే గ్రేస్ అని పేరు పెట్టాలని కోరింది.

కొన్ని రోజులకి గర్భాశయ మార్పిడి కోసం దాత దొరికారు. అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తయ్యి గర్భాశయ మార్పిడి విజయవంతం అయ్యింది. ప్రస్తుతం అమందా పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది. 6పౌండ్ల 11ఔన్సుల బరువున్న ఆ బిడ్డకు అమందా తల్లి కోరుకున్నట్లుగానే గ్రేస్ అని పేరు పెట్టుకుంది. గర్భాశయం లేకుండా జన్మించిన మహిళ, బిడ్డకు జన్మనివ్వడం అరుదైన విషయమే. ప్రస్తుతం బిడ్డ, తల్లి క్షేమంగా ఉన్నారు.