స్కాట్‌లాండ్ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ దేశంలో మహిళలందరికీ శానిటరీ ఉత్పత్తులను ఉచితంగా అందివ్వనున్నారు. శానిటరీ ప్యాడ్లను మహిళలు ఉచితంగా పొందనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 25వ తేదీన స్కాట్‌లాండ్ పార్లమెంట్‌లో కీలకమైన బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే ఆ దేశంలో ఉన్న మహిళలందరూ ఉచితంగా శానిటరీ ప్యాడ్లను పొందవచ్చు.
స్కాట్‌లాండ్‌లో మహిళలకు ఉచితంగా అందివ్వనున్న శానిటరీ ప్యాడ్ల కోసం అక్కడి ప్రభుత్వం ఏటా 24.1 మిలియన్ పౌండ్లను ఖర్చు చేయనుంది. ఈ క్రమంలోనే సదరు ప్యాడ్లను మహిళలు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ సెంటర్లు, యూత్ క్లబ్‌లు, ఫార్మసీలలో ఉచితంగా తీసుకోవచ్చు.
కాగా రెండేళ్ల క్రితం.. అంటే.. 2018లోనే స్కాట్‌లాండ్ అక్కడి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందివ్వడం ప్రారంభించింది. ఇక ఇప్పుడు త్వరలో ఆ దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ వాటిని ఉచితంగా తీసుకోనున్నారు. అయితే మరోవైపు యూకేలో శానిటరీ ఉత్పత్తులపై ప్రస్తుతం 5 శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. యురోపియన్ యూనియన్ రూల్స్ ప్రభావం వల్ల వారు ఆ ట్యాక్స్‌ను తప్పనిసరిగా విధించాల్సి వస్తోంది. అయినప్పటికీ స్కాట్‌లాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయమని పలువురు విశ్లేషిస్తున్నారు..!