ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ విషయంలో ఇప్పటి వరకు ఉన్న అనేక అంచనాల ప్రకారం మ హిళలకు ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువని. నిజానికిగత ఏడాది చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌పై అనేక అధ్యయనాలు వెలువడ్డాయి. వీటిని శాస్త్రీయంగా పరిశీలించామని వైద్య నిపుణులు కూడా చెప్పారు. ఈ క్రమంలో వారు చెప్పిన విషయాలను పరిశీలిస్తే.. ఈ వైరస్ కేవలం 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రమాదం. అదేసమయంలో చిన్న పిల్లలు, యువకులు, మహిళలకు ఈ వైరస్‌తో ప్రమాదం లేదు. మొదట్లో అందరూ ఇలానే అనుకున్నారు. కానీ, తర్వాత తర్వాత ఈ వైరస్ విశ్వరూపం చూశాక.. ఈ అంచనాలు తప్పని తెలిసింది.
ఈ కరోనా వైరస్‌కు మగ, ఆడ, చిన్నా, పెద్దా అనే తారతమ్యాలు లేనేలేవని స్పష్టమైంది. అన్ని వయసుల వారిని ఇది కబళిస్తుందని తాజాగా వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ఇక, మన ఏపీ విషయానికి వచ్చినా ఇదే నిజమవుతోంది. మహిళలపైనా కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 18 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 12మంది మహిళలే ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఏడుగురికి, తూర్పు గోదావరిలో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఇద్దరు చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. గుంటూరులో రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన తల్లీకూతుళ్లలో వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
అనంతపురం జిల్లాలో మక్కా వెళ్లొచ్చిన హిందూపురం వాసితో కాంటాక్ట్‌లో ఉన్న పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువుకు చెందిన వ్యక్తి(56)కి కరోనా లక్షణాలు పెరిగిపోవడంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అతనికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అనంతపురం నర్సింగ్ కాలేజీలో ట్యూటర్‌గా పనిచేస్తున్న స్టాఫ్ నర్సు(35) మక్కా వెళ్లొచ్చిన హిందూపురం వాసికి వైద్యపరీక్షలు చేసింది. ఆ వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఆమెకూ పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. ప్రకాశం జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రకాశం జిల్లా గుడ్లూరుకు చెందిన మహిళ కరోనా లక్షణాలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందడంలో వైద్యులు అలెర్ట్ అయ్యారు. దీంతో ఆమె చికిత్స పొందిన సింగరాయకొండ, ఉలవపాడు, చాకిచర్ల వైద్యశాల సిబ్బందితో పాటు ఆమె కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. కర్నూలు జిల్లాలో ఢిల్లీ వెళ్లి వచ్చినవారి నుంచి కర్నూలు అర్బన్, ఆత్మకూరుకు చెందిన ఇద్దరు మహిళలకు వైరస్ సోకింది. దీనిని బట్టి ఎవరూ కూడా ఈ వైరస్ కు మినహాయింపు కాదని ముందస్తు జాగ్రత్తలతో నే దీనిని అరికట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.