చైనాలో అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ల్యాబ్ లో కరోనా వైరస్ ముందుగా పుట్టిందని చైనాకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ లీ మెంగ్ యాన్ ఇప్పటికే వెల్లడించిన విషయం విదితమే. చైనాలోని ల్యాబ్‌లోనే ఆ వైరస్ పుట్టిందని, తరువాత అది ప్రపంచ దేశాలకు వ్యాపించిందని ఆమె పేర్కొన్నారు. అయితే తాజాగా ఈమె మరొక కీలక విషయం వెల్లడించారు.
కరోనా పాపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకూ భాగం ఉందని డాక్టర్ లీ మెంగ్ ఆరోపించారు. చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెనకేసుకు వచ్చిందని, ఇలా ఎందుకు చేసిందనే విషయాన్ని ఆరా తీయాలని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు మద్దతుగా ఉండడం వల్లే చైనా చేసిన తప్పును ఆ సంస్థ కప్పి పుచ్చిందని, అందువల్లే చైనాను ఆ సంస్థ వెనకేసుకు వస్తుందని, కనుక కరోనా పాపంలో చైనాతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకూ భాగం ఉందని ఆమె అన్నారు.
కాగా నిజాలు చెప్పినందుకు తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, తన కుటుంబం మీద సైబర్ దాడులు చేస్తామని హెచ్చరించారని, అందుకనే తాను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నానని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే డాక్టర్ లీ మెంగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్నుంచీ చైనాకు మద్దతు పలుకుతుండడం, అసలు వైరస్ ఎలా పుట్టుకొచ్చిందనే విషయాన్ని పట్టించుకోకపోవడం.. వంటి అంశాలను పరిశీలిస్తుంటే.. నిజంగానే ఆ సంస్థ వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనిపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.