మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఆ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ ఉంటుంది. దీన్ని వన్‌ప్లస్ నిజాం ప్యాలెస్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర వన్‌ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్ కన్నా ఈ స్టోర్‌ను వైవిధ్య భరితంగా కనిపించేలా తీర్చిదిద్దారు. దీని వల్ల వినియోగదారులకు స్టోర్‌లో సరికొత్త అనుభూతి కలుగుతుంది.
ఈ స్టోర్ లోపలి భాగంలో వినియోగదారుల కోసం ఇంటరాక్టివ్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. వాటిల్లో వినియోగదారులకు ప్రొడక్ట్ కేటలాగ్స్ లభిస్తాయి. అలాగే గోడలపై సమాంతరంగా ఉండే ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. వాటి దగ్గర ఉండే షోకేస్‌లలో వన్‌ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయి.
ఇక ఈ స్టోర్‌లోనే అతి పెద్ద కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో కస్టమర్ ఒక్కో ఎగ్జిక్యూటివ్‌తో ప్రత్యేకంగా మాట్లాడేలా అమరికలను ఏర్పాటు చేశారు. ఇక స్టోర్‌లోని షోకేస్‌లలో అన్ని వన్‌ప్లస్ ప్రొడక్ట్స్ ను కస్టమర్లు పరిశీలించవచ్చు. వాటిని కొనుగోలు చేయవచ్చు. ఇటీవలే లాంచ్ అయిన వన్‌ప్లస్ 8టి 5జి ఫోన్లను కూడా స్టోర్‌లో డిస్‌ప్లే లో ఉంచారు. కోవిడ్ నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్తలను పాటిస్తూ స్టోర్‌ను నిర్వహిస్తున్నామని స్టోర్ ప్రతినిధులు తెలిపారు.
కాగా దేశంలో వన్‌ప్లస్‌కు మొత్తం 5వేలకు పైగా ఆఫ్‌లైన్ స్టోర్స్ ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలో మరిన్ని స్టోర్స్ ను ఏర్పాటు చేయనున్నారు. అందుకు గాను రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. మరో 100 నగరాల్లో స్టోర్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.