జగన్ పరిపాలన జనరంజకంగా ఉంది అని, ప్రజల కోసమే నిరంతరం పని చేస్తూ పార్టీ నాయకులను సైతం పక్కన పెట్టే విధంగా వ్యవహరిస్తూ, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి జగన్ కృషి చేస్తున్నారు అని ప్రచారం కొంతకాలం గా జరుగుతూనే వస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం జగన్ పరిపాలన జనరంజకంగా లేదని , వివాదాలకు కేంద్ర బిందువుగా ఉందని, జగన్ పట్టుదలతో ఆ విధంగా ముందుకు వెళుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు నిజంగా జగన్ పరిపాలన పై ప్రజలు ఏమనుకుంటున్నారు ? జగన్ ఆశిస్తున్నట్టు గా జన బలం వైసీపీ ప్రభుత్వానికి ఉందా లేదా ? ప్రతిపక్షాల ఆరోపణలు ఇలా అనేక విషయాలు అన్నిటిని తెలుసుకునేందుకు మరెంతో కాలం లేదు.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వాస్తవం ఏమిటనది తేలిపోనుంది.సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి జగన్ ఏడాదిన్నర దాటుతున్న తరుణంలో, తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసిపి అభ్యర్థి విజయం సాధిస్తే జగన్ తన సత్తా నిరూపించుకోవడంతో పాటు, తమ రాజకీయ ప్రత్యర్థులు మరింత బలహీనం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. తిరుపతి ఎంపీ గా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఈ ఎన్నిక రాబోతోంది. అయితే ముందుగా అందరూ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవకాశం కల్పిస్తారని భావించినా, అక్కడ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇచ్చిన వారు గెలిచినా, సానుభూతి ఓట్లు గెలిపించాయి అని ప్రతిపక్షాలు హేళన చేసే అవకాశం ఉండటంతో వారికి అవకాశం లేకుండా చేశారు.
పూర్తిగా రాజకీయాలకు కొత్త అయిన వ్యక్తిని అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు.ఇక్కడ గెలిచి ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం లేకుండా చేయాలని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి, అవినీతి రహితంగా పరిపాలన అందిస్తున్నామని, కాబట్టి తమకు జనాలు మళ్లీ పట్టం కడతారని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ గెలిచి తీరాలనే కసితో బిజెపి జనసేన టిడిపి లు ఉన్నాయి. వారందరికీ విజయం దక్కకుండా చేసి మళ్లీ వైసీపీ జెండా ని తిరుపతి ఎన్నికల్లో ఎగరవేసి తన సత్తా చాటుకోవాలని జగన్ చూస్తున్నారు. జగన్ కోరిక నెరవేరాలన్నా, ప్రతిపక్షాల మాటల్లో నిజం ఉందా లేదా అనేది తేలాలి అన్నా, ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు ఓటముల పై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వైసిపి అభ్యర్థి గెలిస్తే పెద్ద సంచలనం ఏమి కాకపోయినా, ఓడితే కనుక అది రాజకీయ సంచలనంగా మారడంతో పాటు, అనేక రాజకీయ సమీకరణాలకు నాంది గా మారే అవకాశం లేకపోలేదు.