తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.. ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యా విధాన పరిషత్ బుధవారం జీవో జారీ చేసింది. ఏరియా ఆస్పత్రి నిర్మాణానికి రూ. 45.79 కోట్ల నిధులు కేటాయించారు.
దీంతో పాటు ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా 13 ప్రాథమిక ఉప కేంద్రాలను మంజూరు చేసింది ప్రభుత్వం. ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ. 20 లక్షలు కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ప్రస్తుతం యాదాద్రి ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. తిరుపతి స్థాయిలో భారీ సంఖ్యలో భక్తులు స్వయంభువులను దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం ఉన్న 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు.