రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల
రామకృష్ణుడు. ఇవాళ రాష్ట్ర అప్పులపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యనమల కౌంటర్ ఇచ్చారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి అబద్ధాలు చెప్పారని విమర్శించారు యనమల. రాష్ట్ర వాస్తవ ఆర్ధిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్న పత్రికలపై తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని, సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని బుగ్గనపై మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రూ.7 లక్షల కోట్ల అధికార, అనధికార అప్పులు చేసిందని యనమల వెల్లడించారు. కానీ, గత ప్రభుత్వాల కంటే తక్కువ అప్పులు చేశామంటూ బుగ్గన బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
“18 మంది ముఖ్యమంత్రులు 66 ఏళ్లలో రూ.3,62,375 కోట్లు అప్పులు చేస్తే, కేవలం జగన్ రెడ్డి నాలుగేళ్లలో దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారు. గత ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వృద్ధిరేటు 10.78 శాతం ఉంటే జగన్ రెడ్డి అసమర్థత కారణంగా అది 6.4 శాతానికి పడిపోయింది.
వైసీపీ ప్రభుత్వ ఆర్ధిక నిర్వాహణ అంత అద్భుతంగా ఉంటే ప్రధాన రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగం ఎందుకు సంక్షోభంలో ముగిపోయాయి? బుగ్గన పేర్కొంటున్నట్టు, అప్పులపై వైసీపీ ప్రభుత్వం నిజంగానే పారదర్శకంగా లెక్కలు చెబుతోందనుకుంటే… రూ.1,36,198 కోట్లు బడ్డెట్‌లో చూపకుండా అప్పులు చేశారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపట్టింది?