అనంతలో అభ్యర్దులను కాపాడుకోవడమే గగనంగా మారిందా

-

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు ఇస్తున్న షాక్‌కు..టీడీపీ నేతల మైండ్ బ్లాక్ అవుతోంది. గెలుపోటముల సంగతి పక్కనబెడితే..అసలు పోటీలో ఉన్న అభ్యర్థులను కాపాడుకోవడమే కష్టంగా మారింది. ఎప్పుడు ఏ అభ్యర్థి జంప్ అవుతాడో తెలీక నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఏ ఎన్నికల్లో అయినా పార్టీ సత్తా చాటాలంటే ప్రజలు ఓట్లు వేయాలి. పార్టీ అభ్యర్థులు కూడ బలమైన బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవాళ్లు ఉండాలి. కానీ అనంతపురం జిల్లాలో పార్టీ అభ్యర్థులు బలంగా ఉండటం అటుంచితే.. అసలు బరిలో నిలిచేది ఎవరన్నది అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తీరు కాస్త విచిత్రంగానూ, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉన్నాయి.

అనంతపురం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో 462 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ తరఫున 190, టీడీపీ తరఫున 130 దాఖలయ్యాయి. అన్ని వార్డుల్లోనూ రెండు ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు కొందరు టీడీపీ అభ్యర్థులు పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఉపసంహరణ గడువు మార్చి 3న ముగియనుంది. ఈ సమయంలో వాళ్లు వైసీపీలో చేరి నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారని… వైసీపీ ఏకగ్రీవం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఎన్నికల్లో గెలుపు సంగతి అటుంచితే..కనీసం అభ్యర్థులనైనా కాపాడుకోవడం టీడీపీకి గగనంగా మారింది. ఎప్పుడు ఏ అభ్యర్థి జంప్ అంటాడో తెలియని పరిస్థితి. జిల్లాలో గత కొన్ని రోజులుగా పరిస్థితి చూస్తే వార్డు మెంబర్లుగా రేస్‌లో ఉన్న వారే వెళ్లిపోతుండటం టీడీపీకి ఒక విధంగా షాక్ అనే చెప్పాలి. అనంతపురం కార్పొరేషన్‌లో దాదాపు 10 డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కండువా మార్చేశారు.

రాయదుర్గం, ధర్మవరం మున్సిపాల్టీలోనూ పార్టీ మార్పులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక మంత్రి శంకర్‌నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్ధి అధికార పార్టీలో చేరటం కలకలం రేపింది. ఏకంగా మండలాల్లో కీలకంగా ఉన్న నేతలే పార్టీ మారుతుండటంతో అసలు పోటీలో ఎవరుంటారన్నది అర్థం కాని పరిస్థితి.మొత్తం మీద పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ నేతలు ప్రచారం పక్కన బెట్టి అభ్యర్థులను బరిలో దింపడం కోసమే టైం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news