టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు ప్రత్యర్ది పార్టీలకు షాకిస్తూ బలమైన నేతలను ఆకర్షించి కారు ఎక్కించేసింది. కాంగ్రెస్ లో ప్రభావం చూపగలిగిన బలమైన నేతలను..తెలంగాణలో ఉనికి కూడా ప్రశ్నార్ధంకంగా మారిన టీడీపీని దాదాపుగా ఖాళీ చేసింది. అయితే ఇప్పుడు నేతలను వదిలేసి కేడర్ పై కన్నేసిందట గులాబీ దళం. ప్రభావం చూపగల నేతలున్నా వారిని అలానే ఉంచి అనుచరులను మాత్రం లాగేస్తున్నారట అధికార పార్టీ నేతలు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న ప్లాన్ బీ ఆపరేషన్ ఆకర్ష్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.
రెండవ సారి అధికారంలోకి వచ్చింది మొదలు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ మరింత ఊపందుకుంది. రాజకీయ పునరేకికరణ పేరుతో కాంగ్రెస్ నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలను గులాబీ గూటికి చేర్చింది. అయితే ఖమ్మం జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు జై కొట్టినా భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరయ్య మాత్రం గులాబీ కండువ కప్పేసుకోవడానికి ఒప్పుకోలేదు. దీంతో జిల్లాకి చెందిన టీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కొత్త వ్యూహానికి తెర తీశారు.
ఎమ్మెల్యే వీరయ్యకు,భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నారు. ఇటీవలే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన లోకేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నక్కా ప్రసాద్ సైతం జెండా తిప్పేశారు. వీరిద్దరికీ అధికార పార్టీలోని కొందరితో పడదు. అయినా వాళ్లూ వీళ్లూ కలిసి ఇప్పుడు ఒకే గూటి పక్షులుగా మారిపోయారు. భూ తగాదాల్లో రెండు వర్గాలుగా విడిపోయి పోలీస్ కేసులు పెట్టుకున్నవారు సైతం ఇప్పుడు పాత వైరాలు మర్చిపోయారట. అందరు నేతలు గులాబీ గూటికే చేరారట.
వీరే కాక భద్రాచలంలో కాంగ్రెస్‌కు బలమైన వర్గంగా ఉన్నవారు సైతం టీఆర్‌ఎస్ శిబిరంలోకి వెళ్లిపోతారనే ప్రచారం మొదలైంది. అదే జరిగితే ఎమ్మెల్యే వీరయ్య పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లోకి వచ్చేయాలని చెప్పినా వీరయ్య వినకపోవడం వల్లే ఆయన్ని ఒంటరి చేసే విధంగా అనుచరులను లాగేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లు నేతలను మాత్రం టార్గెట్ చేసిన అధికారపార్టీ ఇప్పుడు కేడర్ పై దృష్టి పెట్టడంతో టీఆర్ఎస్ ప్లాన్ బీ ఆపరేషన్ ఆకర్ష్ పై ఇంటాబయటా ఆసక్తికర చర్చ నడుస్తుంది.