రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వింత సమస్యను ఎదుర్కొంటోందా? అన్యాపగా వస్తున్న సమస్యలతో తల బొప్పి కడుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రబుత్వ ప్రమేయం లేకుండానే జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా పాలక పెద్దలు విమర్శలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి ఎదురైన తలనొప్పులు చాలవన్నట్టుగా వివిధ వర్గాల నుంచి కూడా ప్రభుత్వంపై దాడులు జరుగుతున్నాయి. కొన్నాళ్ల కిందట నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విషయం చర్చకు వచ్చింది. ఆయనను పోలీసులు నడిరోడ్డుపై చేతులు వెనక్కి విరిచికట్టడం తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.
ఈ పరిణామం నుంచి ప్రభుత్వం ఇంకా కోలుకోక ముందే.. కోర్టుల్లో కేసులు కొనసాగుతుండగానే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూ రు నియోజకవర్గం నుంచి మరో పిడుగు పడింది. ఇది కూడా దళిత డాక్టర్ ఉదంతమే కావడంతో ప్రభుత్వానికి మరో తలనొప్పి వచ్చిందని అంటున్నారు. డాక్టర్ అనితా రాణి.. పెనుమూరు పీహెచ్‌సీలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. అయితే, ఈమెను వైసీపీ నాయకులు కొందరు వేధించారని, ఆమెను ఫొటోలు తీశారని ఆమె ఆరోపించారు. అంతేకాదు.. పోలీసులకు ఫిర్యాదు చేయడం.. అటు నుంచి హైకోర్టులోనూ పిటిషన్ వేయడం పెను వివాదానికి దారితీసింది.
ఇవన్నీ ఇలా ఉంటే.. విషయాన్ని టీడీపీ మహిళా నాయకురాలు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫోన్‌లో వివరించడం మరో వివాదానికి దారితీసింది. అనిత.. ఈ వ్యవహారాన్ని రోడ్డెక్కించారు. డాక్టర్ అనితారాణి మాట్లాడిన రికార్డును సోషల్ మీడియాలో పెట్టారు. దీనిని చూసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ .. వెంటనే ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి.. కామెంట్లు పెట్టడంతో ఈ వివాదం యూటర్న్ తీసు కుంది. వెనువెంటనే జగన్.. వ్యూహాత్మకంగా వ్యవహరించి కేసును సీఐడీకి అప్పగించారు.
ఇదిలావుంటే.. డాక్టర్ అనితకు సంబంధించి స్థానిక అధికారులు అందించిన నివేదిక ప్రకారం.. ఆమె దూకుడు గల డాక్టరని, ఆది నుంచి కూడా వివాదాలకు కేంద్రంగా మారిందని ఇప్పటికే అనేక జిల్లాలకు మార్చిన విషయాన్ని అయినా ఆమె తన పద్ధతి మార్చుకోనివిషయాన్ని కూడా వివరించారు. ఏదేమైనా.. ఇది ప్రభుత్వానికి మరో తలనొప్పిగా మారిందని అంటున్నారు వైసీపీలోని సీనియర్లు. ప్రభుత్వ ప్రమేయం లేకుండానే సాగుతున్న ఇలాంటి వివాదాలతో పరువు పోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.