వైసిపి ప్రభుత్వం అభివృద్ధి పై దృష్టి పెట్టలేదన్నారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ప్రజలకు సంపదను పంచుకుంటూ పోతుంటే రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజధాని విషయం ఓ కొలిక్కి రాకపోవడంతో పెట్టుబడులు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
ప్రజలకు శాశ్వతంగా అభివృద్ధి కలిగే పనులు చేయాలి కానీ ఉచితంగా పథకాలు అమలు చేస్తే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇప్పటికైనా స్పందించి ఉచిత పథకాలను నిలిపివేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు టీజీ వెంకటేష్. ఇక రాయలసీమ పశ్చిమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా బిజెపి అభ్యర్థి తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.