ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని వీడటానికి ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారా…? 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి రెడీ అయ్యారా…? అంటే అవుననే అంటున్నారు వైసీపీ కీలక నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాము వచ్చినా వారిని ఎం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సజ్జల ఈ వ్యాఖ్యలు చేసారు.
త్వరలో పార్టీ సభ్యులతో నిండిపోయే శాసనమండలిని రద్దు చేయడం వల్ల వైసీపీకే నష్టమని అయినా సరే సిఎం జగన్ మండలిని రద్దు దిశగానే అడుగులు వేస్తున్నారని సజ్జల అన్నారు. శాసనమండలి రద్దుపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్న ఆయన, మేథావుల సలహాలూ సూచనలూ తీసుకునేందుకే కొంత గడువు ఇచ్చామని, మండలి చైర్మన్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారని మండిపడ్డారు.
టీడీపీ కార్యకర్తలా చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండలి రద్దు బిల్లుని కేంద్రం ఆపే అవకాశం లేదని సజ్జల అన్నారు. కచ్చితంగా ఆమోదం తెలిపే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. బిల్లుల స్థానంలో ఆర్డినెన్సును కూడా తెచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తమ నిర్ణయం సైరైనదో కాదో ప్రజలే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీర్పు చెప్తారని సజ్జల అన్నారు.