ఆయనో తలపండిన రాజకీయవేత్త. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు. గతంలో మంత్రిగా కీలక శాఖలు నిర్వహించిన ఆయన కేబినెట్‌కు దూరమై చాన్నాళ్లు అయ్యింది. పార్టీ పవర్‌లో ఉన్నా.. చేతిలో అధికారం లేదని ఫీలవుతున్నారో ఏమో.. ఆ మధ్య చింత నిప్పులు చెరిగారు. ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు అధికారులు, పార్టీ నేతల పై ఓ రేంజ్ లో ఫైరయిన ఎమ్మెల్యే ఆనం ఇప్పుడు సడన్ ఎందుకు సైలెంట్ అయ్యారన్నదాని పై సింహపురిలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
నెల్లూరు రాజకీయ చిత్రపటంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిది ప్రత్యేక స్థానం. ఏడు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఆనం కుటుంబంలో రెండో తరం నాయకుడాయన. పొలిటిక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నెల్లూరు, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ తోపాటు వైఎస్ హయాంలోనూ మంత్రిగానూ పనిచేశారు. అలాంటి రామనారాయణరెడ్డి చేతిలో ఎమ్మెల్యే గిరి ఉన్నా మునుపటి ఉత్సాహం లేదు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి వెంకటగిరి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గం దాటితే ఒట్టు. గతంలో రాష్ట్రమంతా చుట్టేసిన ఆయన ఎందుకో బరిగీసుకుని వెంకటగిరిలోనే ఉంటున్నారు. ఆర్నెళ్ల క్రితం ఓసారి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యమేలుతోందని సంచలన వ్యాఖ్యలు చేసి అధికార పార్టీలో కలకలం రేపారు. మంత్రి అనిల్, రూరల్ ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. వైసీపీలో దుమారం రేగడంతో ఆనంను పార్టీ నుంచి బయటకు పంపుతారని అంతా అనుకున్నారు. కానీ.. సీఎం జగన్‌తో ఆనం రామనారాయణరెడ్డి భేటీ తర్వాత సమస్య టీ కప్పులో తుఫాన్‌గా చల్లారిపోయింది.
సీఎం చెప్పినా అధికారులు తన మాట వినడం లేదని మరోసారి చింత నిప్పులు చెరిగారు. సోమశిల నీటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వెంకటగిరి రాష్ట్రంలో లేదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనం. అనుచరులతో కలిసి ఓ రోజంతా నియోజకవర్గంలో పర్యటించి చెరువులకు స్వయంగా నీటిని విడుదల చేశారు. తర్వాత ఎందుకో సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజుతో కలిసి ఆనం రామనారాయణరెడ్డి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇవి పాత ఫొటోలుగా చెబుతున్నారు. ఎవరో కావాలనే బయటకు తీశారని అనుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆనం చుట్టూ రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది.
మొన్నటి వరకూ ఓ రేంజ్‌లో ధిక్కార స్వరం వినిపించిన ఆయన ఎందుకు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారన్నదానిపై చర్చ జరుగుతోంది. ఆయనకు ఆయనే సైలెంట్ అయ్యారా లేక ఎవరైనా నోరు కట్టేశారా అన్న కోణంలో కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఒకప్పుడు మంత్రిగా తన కనుసైగలతో యంత్రాంగాన్ని శాసించిన ఆనం రామనారాయణరెడ్డి… ఇప్పుడు పార్టీ పవర్‌లో ఉన్నా.. చేతిలో అధికారం లేకపోయే సరికి ఏదో వెలితిగా భావిస్తున్నారట. అయితే ఆయన లక్షం నెరవేరింది కాబట్టే.. మౌన వ్రతం పాటిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా.. ఆనం రామనారాయణరెడ్డిని తక్కువగా అంచనా వేయడానికి లేదంటున్నారు ఆయన గురించి తెలిసిన వారు.
ఇప్పటికే జిల్లాలో ఆనం కుటుంబానికి ఉన్న అభిమనులను, వర్గాలను పోగు చేసే పనిలో పడ్డారట. మరి.. ఆనం అనుకున్నది సాధిస్తారో.. ఉన్నాదాంతో సరిపెట్టుకుంటారో చూడాలి.