ఎన్నో ఆశయాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు సంకట పరిస్థితులు తలెత్తుతున్నాయి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేపట్టిన తప్పుడు విధానాలను ఎండగడుతూ ప్రజల సంక్షేమం కోసం అలా కాదు.. ఇలా పనిచేయాలని చెప్పిన ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉండాలో ఉండకుండా.. గత పాలనకు ఏమాత్రం తీసిపోని పరిస్థితులే వస్తే… అప్పుడు ఏంటీ పరిస్థితి.. ఒక ఎమ్మెల్యే ఒక ఉన్నతాధికారిపై గుండాగిరి చేస్తే దాన్ని తమకు అనుకూలంగా, ఆ అధికారికి అండగా పోరాటం చేసిన ప్రతిపక్షం అధికారంలోకి వస్తే అధికారులను సొంత అన్నదమ్ముల్లా… అక్క చెల్లెల్లా.. చూసుకుంటారని భ్రమిస్తే… అది భ్రమగానే మిగిలిపోతే.. అధికారుల పరిస్థితి ఏమిటి… పార్టీ దుస్థితి ఎలా ఉంటుంది.
అధికారులకు భద్రత ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుగా అనిపించినవి.. అధికారంలోకి వచ్చిన తరువాత ఒప్పుగా అనిపిస్తే.. ఇక ప్రతిపక్షానికి, అధికార పక్షానికి తేడా ఏంటిది.. దీనికి ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది.. అని ఆలోచిస్తే జనాలు రాజకీయ నాయకులే ఇలా అనే పరిస్థితి రాదా ఓసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఎదురైంది.. ఇంతకు అసలు విషయానికి వస్తే.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక అక్రమ రవాణాకు అడ్డు వస్తున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్ష నేతగా జగన్ వనజాక్షికి అండగా నిలిచారు. అధికార టీడీపీపైన, ఎమ్మెల్యే వైఖరిపైన దుమ్మెత్తిపోసారు. ఎమ్మెల్యేను వెంటనే భర్తరఫ్ చేయాలని ఆనాడు డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంకటంగా మారారు. సీఎం జగన్ ఎంతో ఆశయంతో చేస్తున్న యజ్ఞాలకు విజ్ఞాలు కలిగించేలా తయారయ్యాడు.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలే అవుతున్నా కనివిని ఎరుగని పథకాలతో, ప్రజాసంక్షేమం కోసం చేస్తున్న పనులతో, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనతో ముందుకు పోతున్నారు.
దీనికి తోడు అవినీతి లేని నీతిమంతమైన పాలన అందిస్తానని ప్రతిపక్షనేతగా మొదలు అధికార పక్ష నేతగా మారినా కూడా అదే చెపుతూ వస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహార శైలీ ఆది నుంచి వివాదస్పదంగానే ఉంది. టీడీపీకి చితిని పేర్చింది చింతమనేని ప్రభాకర్ ఐతే, వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాష్టం పేర్చేందుకు ఉన్నట్లుంది పరిస్థితి. అసలు చింతమనేని వ్యవహారానికి కోటంరెడ్డి వ్యవహారాలకు ఎక్కడా తేడా లేకుండా ఉంది.. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ సీఎం జగన్ కంట్లో నలుసుగా తయారయ్యాడు.. తన పాలనలో ఏదైతే జరుగకూడదు అని సీఎం జగన్ ఆశించాడో.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అదే చేసి చూపాడు. ఓ మహిళా ఎంపీడీఓను దూషించి జగన్ సర్కారు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ ఒక్క చర్యతో గంగలో కలిపేసాడు కోటం రెడ్డి.
ఈ ఎమ్మెల్యే కోటంరెడ్డితో జగన్‌కు మంచిపేరు కన్నా చెడ్డపేరే ఎక్కువ రావడానికి ఆస్కారం ఉన్నందున కోటంరెడ్డిని భర్తరఫ్ చేస్తారా.. లేక సీఎం జగన్ చొరవ తీసుకుని రాజీనామా చేయిస్తాడా వేచిచూడాల్సిందే… ఒకవేళ సీఎం జగన్ మహిళా అధికారిని దూషించిందే నిజమైతే కోటంరెడ్డిని నైతికంగా రాజీనామా చేయిస్తే జగన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం.. ఒకవేళ ఉపేక్షిస్తే.. మరో చింతమనేనిలా తయారవ్వడం ఖాయం.. జగన్ సర్కారు పరువు బజారున పడి.. వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయం… ఏదేమైనా కంట్లో నలుసును తొలగించుకుంటారో.. లేక దాన్ని అలాగే వదిలేస్తే చూపును పోగొట్టుకుంటారో సీఎం జగన్ చేతుల్లోనే ఉంది..