ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తైతే గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు మరో ఎత్తు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ వెలుగు రేఖగా భావిస్తున్న విశాఖపై అధికారం, ఆధిపత్యం ప్రథమ పౌరుడిదే. అందుకే ఇక్కడ పాగా వేయడం అధికార వైసీపీకి ప్రతిష్టాత్మకం కాగా.. పట్టు నిలబెట్టుకోవడం ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అత్యవసరం. దీంతో గ్రేటర్ పోరు హోరాహోరీగా మారుతోంది. ప్రభుత్వం విశాఖను ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించింది. దీంతో గ్రేటర్ మేయర్ పదవి హాట్ సీట్ గా మారింది.
భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ పరిధి భారీగా విస్తరించింది. 8 అసెంబ్లీ నియోజక వర్గాలు జీవీఎంసీ పరిధిలో ఉన్నా యి. విలీన ప్రాంతాలతో కలుపుకుని నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్య 98కి పెరిగిన తర్వాత..తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కూడా ఇవే. వైసీపీ
విశాఖలో ప్రథమ పౌరుడిగా పోటీలో ఉండేది ఎవరా అనే ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు నగర ప్రజాల్లోనూ ఉంది. ఈసారి మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. 98 డివిజన్లలో అధికార పార్టీ సుమారు 50 శాతం మహిళలకు కేటాయించింది. మిగిలిన స్థానాల్లో పోటీలో ఉన్న బీసీ అభ్యర్థుల్లో ఎవరికి మేయర్ అవకాశం దక్కుతుందా అనేది ఉత్కంఠగా మారింది.
వైసీపీ నుంచి నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు కొన్నాళ్లుగా చర్చల్లో నలుగుతోంది. ఐతే అధికార పార్టీ మాత్రం మేయర్ అభ్యర్థి విషయంలో గుంభనంగానే వ్యవహరిస్తోంది. వ్యక్తుల మీద అంచనాలు పెంచేయకుండా..మెజార్టీ కార్పొరేటర్లను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని దూకుడుగా వెళుతోంది. గ్రేటర్ పీఠం సీఎంకు రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తామంటున్నారు ఎమ్మెల్యేలు. అవంతి శ్రీనివాస్,ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తమ వారసులను జీవీఎంసీ బరిలో నిలిపారు.
అటు, తెలుగుదేశం పార్టీలో మేయర్ అభ్యర్థిత్వానికి గట్టి పోటీనే కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలను గెలుచుకున్న బలంతో పాటు..గ్రేటర్ ఓటర్ విలక్షణ తీర్పు తమకు కలిసి వస్తుందనే అంచనాలు టీడీపీలో బలంగా ఉన్నాయి. నాయకులు వెళ్ళిపోయినా టీడీపీకి కేడర్ బలం ఉది. ఈ నేపధ్యంలో మేయర్ అభ్యర్థిగా రేసులో ఉన్నవారిని వడపోస్తోంది. ఇప్పటికే నలుగురు రెడీ అవ్వగా.. వారిలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, సీనియర్ నాయకుడు పీలా శ్రీనివాస్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
టీడీపీ నుంచి మేయర్ సీటు పై ఎక్కువ వడపోతలు నడుస్తున్నాయి.
అభ్యర్ధుల బలాబలాలు, మేయర్ అభ్యర్ధిగా ప్రకటిస్తే ఎంతవరకు రాణిస్తారు ఏ విధంగా సమన్వయం చేస్తారు ఆర్ధిక పరిస్ధితులు వంటివి ప్రధానంగా టీడీపీ బేరీజు వేస్తోంది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తనకు ఉన్న రాజకీయ అనుభవం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక, పీలా శ్రీనివాస్ కుటుంబానికి పెందుర్తితో పాటు అనకాపల్లిలోనూ గుర్తింపు ఉంది. ఆయన సోదరుడు గోవింద్ సత్యన్నారాయణ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్థికంగాను నిలబడగలిగిన సామర్ధ్యం ఉంది. దీంతో టీడీపీ మేయర్ అభ్యర్థి ఎవరనేది ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తుండగా ప్రధాన పార్టీల తరఫున మేయర్ అభ్యర్థిగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది… అంతకంటే ఆసక్తికరంగా మారింది.