జీవితంలో పైకి వచ్చే పనులు ఎన్నో చేయాలి.జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే మంచి పనులు కొన్ని, విభిన్నతతో కూడిన ఆసక్తులు కొన్ని వెలుగులోకి వస్తాయి.అవమానం ఎంతున్నా భరించి దాటుకుని రావడంలో సిసలు విజయం ఉంది. ఆ రైతు అదే చేశాడు. అవమానం దాటుకుని వచ్చి తానేంటో నిరూపించాడు.రైతే రాజు అని నిరూపించి తన సత్తా చాటాడు. జీవితంలో ఎన్నో అవరోధాలు, చీడ పీడలు ఉక్కు సంకల్పంతో దాటిన ఆ రైతు ఇప్పుడొక స్ఫూర్తి.ఈ కథ కర్ణాటకలోని తుముకూర్ మహేంద్ర షోరూంలో జరిగింది.
బొలెరో పికప్ ట్రక్కు .. దీని విలువ పది లక్షలు. తాను కొనుగోలు చేయాలని అనుకున్నాడు కెంపేగౌడ అనే రైతు.అనుకున్నదే తడవుగా షోరూంకు వెళ్లాడు. వివరం అడిగి తెలుకుంటుంటే ఆ షాపు సిబ్బంది ఆయనను అవమానించారు. ఇదేమయినా పది రూపాయల బొమ్మ కారు అనుకున్నావా అని అవమానించారు.వెంటనే గంటలో డబ్బులు తీసుకువచ్చి తన స్నేహితుల ఎదుటే తనను అవమానించిన వారికి ఆ డబ్బు కట్టి, గంటలోనే ట్రక్కు డెలివరీ ఇవ్వాలని పట్టుబట్టాడు. ఈ విషయం ఇక్కడితో వదిలేయక షో రూం సిబ్బంది అనుచిత ప్రవర్తనపై పోలీసులను ఆశ్రయించాడు. ఆఖరికి సిబ్బంది దిగివచ్చి లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పారు.
జీవితంలో ఎవ్వరినీ తక్కువగా చూడకండి.ఎవ్వరిలో ఏ విషయం దాగి ఉందో ఎవరికి తెలుసు అని! దేశానికి అన్నం పెట్టే రైతు లక్షాధికారి ఎందుకు కాకూడదు.ఆయనను చూస్తే మనకెందుకు అంత చిరాకు, కోపం. వేషం చూసి మనుషులను అంచనా వేసే సంస్కృతి వద్దనుకుంటే మేలు