అసలే అంతంత మాత్రంగానే ఉన్నఆదాయ స్థితిగతులపై కరోనా దాడి కొనసాగిస్తూనే ఉంది. ఉన్నట్టుండి లాక్డౌన్ పెడితే ఏమౌతుంది అన్న సందిగ్ధత ఒకటి వెన్నాడుతూనే ఉంది మన గౌరవ యంత్రాంగానికి! అందుకే వీలున్నంత మేరకు నిబంధనలు పాటించి కరోనాను దూరం చేసేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ఎనభై వేలకు పైగా కేసులు యాక్టివ్ అయినందున ఇకపై ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే అమలవుతున్న ఆంక్షలకు తోడు కొన్ని ఆంక్షలు జతచేసి నిత్యావసర సరకులు కొనుగోలుకు రిలీఫ్ టైం ఇచ్చి లాక్డౌన్ ను విధించాలన్నది మునుపటిలానే సంబంధిత విధివిధానాలు ఖరారు చేయాలన్నది జగన్ యోచన.
ఆంధ్రావనిలో మళ్లీ లాక్డౌన్ విధించేందుకు చూస్తున్నారని సమాచారం వస్తోంది.దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో కరోనా వ్యాప్తి ఉద్ధృతం అయి పోతున్న దశలో దీని కట్టడికి మళ్లీ లాక్డౌన్ అస్త్రాన్నే ప్రయోగించాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.
రోజుకు పదిహేను వేల కేసులు నమోదవుతున్నందున ముందున్న కాలంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సీఎం జగన్ త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కూడా ఫలితం పెద్దగా లేదు. అందుకే లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కరోనా రెండో దశలో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూను అమలు చేశారు. అదేవిధంగా ఈ సారి కూడా నిర్ణీత సమయాల్లో లాక్డౌన్ ను విధించి, కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని జగన్ యోచిస్తున్నారు.లాక్డౌన్ విధిస్తే చాలా మంది ఉపాధి పోయే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయంపై జగన్ ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే లాక్డౌన్ విధించేందుకు జగన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.