మౌంటెనీరింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది. కొందరు ఆ కలను సాకారం చేసుకోవడానికి విపరీతంగా కష్టపడతారు. కొందరు అనుకోవడంతోనే సరిపెడతారు.. లైఫ్ లో ఒక్కసారి చేయడమే పెద్ద ఎచీవ్ మెంట్.. అలాంటిది పర్వతారోహణ చేయడమే ప్రవృత్తిగా చేసుకుంది.. మహారాష్ట్రకు చెందిన ప్రియాంక మోహితే. ఎలా సాధ్యమవుతుంది..? తన జర్నీ గురించి మనకు ఓ లుక్కేద్దామా..!
30 ఏళ్ల ప్రియాంకది పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లా. చిన్న వయసు నుంచే ప్రియాంకకు పర్వతారోహణ అంటే బాగా ఇష్టముండేది… పెద్దయ్యే కొద్దీ తన అభిరుచిపై మరింత పట్టు సాధించింకుంది… ఓవైపు చదువు కొనసాగిస్తూనే, మరోవైపు మౌంటెనీరింగ్‌లో మెలకువలు నేర్చుకుంది.
బ్యాలన్స్ చేస్తూ..!
ముంబయి యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీ విభాగంలో పీజీ పట్టా అందుకున్న ప్రియాంక.. ప్రస్తుతం రీసెర్చ్ అసోసియేట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇలా ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు పర్వతారోహణపై దృష్టి పెడుతూ.. తాను టీనేజ్‌లో ఉన్న సమయంలోనే మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల్ని అధిరోహించింది.
2012లో ఉత్తరాఖండ్‌లోని బందర్‌పంచ్ పర్వతశ్రేణిని అధిరోహించి తన మౌంటెనీరింగ్ జర్నీని ప్రారంభించింది. ఆపై 2015లో హిమాచల్‌ప్రదేశ్‌లోని రెండో ఎత్తైన శిఖరం మౌంట్ మెంథోసా (6,443 మీటర్లు) శిఖరాగ్రాన్ని చేరుకుంది.
ప్రపంచంలోనే మూడో ఎత్తైన శిఖరం మౌంట్ కాంచన్‌జంగా (8,586 మీటర్లు)ను అధిరోహించింది ఈ యంగ్ మౌంటెనీర్.. తద్వారా 8 వేల మీటర్ల పైచిలుకు ఎత్తైన ఐదు పర్వతాల్ని ఎక్కిన తొలి భారతీయ మహిళగా కూడా చరిత్ర సృష్టించింది. ఇవేనా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్, మకాలూ, కిలిమంజారో, లోత్సే, అన్నపూర్ణ పర్వతాలను సైతం అధిరోహించి అరుదైన విజయాలు నమోదు చేసింది.
ఇలా పర్వతారోహణలో అనితర సాధ్యమైన రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రియాంక మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సాహస క్రీడల విభాగంలో ‘శివ్ ఛత్రపతి స్టేట్ అవార్డ్’ అందుకుంది. 2020లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్’తో సత్కరించింది. చిన్నప్పటి నుంచి పర్వతారోహణ మీద ఆసక్తితో తాను అదే మైండ్ సెట్ తో ఎదిగి.. నేడు ఈ రికార్డులను సృష్టించింది. మనకు కూడా మనసులో ఏదో ఒక కోరిక బలంగా ఉంటుంది.. వాటిని నేరవేర్చుకున్న రోజు ఆనందానికి అవథులు ఉండవు.
-Triveni Buskarowthu