నిన్నటి వేళ గీ ముచ్చట విన్నారే ! ఆయనేమో ఢిల్లీకి పోయి బడికి పోయి ఎంచక్కా ఫొటోలు దిగుడు, వాటిని అప్ లోడ్ చేసుడు చేసిరి అని అంటున్నరు తెలంగాణ రాష్ట్ర సమితిని విమర్శించే పెద్దలు మరియు చిన్నలు. ఇంకా సోషల్ మీడియా యాక్టివిస్టులు.. పబ్లిక్ డొమైన్ లో ఉండే ఇంకొందరు. వాస్తవానికి ఢిల్లీ బడులు దేశానికే ఆదర్శం అని మీడియా కూతలు ఎన్నో కూసింది. రాతలు కూడా రాసింది. వాటికి దగ్గరగానే ఆ బడులు ఉన్నాయని కేసీఆర్ సర్ ఒప్పుకున్నారు. ఇదంతా బాగుంది కానీ తెలంగాణ బడులకు ఆ శోభ ఎప్పుడొచ్చె అని అడుగుతున్నరు.
వాస్తవానికి సర్కారు బడులకు కొత్త రూపు ఇచ్చింది ఇవ్వాలనుకున్నది జగన్ మాత్రమే అని వైసీపీ అంటోంది. ఢిల్లీ స్కూలింగ్ కు పోటీగా తమ బడులు ఉన్నాయని, ఇకపై కూడా నాడు నేడు కొనసాగి ఇంకొన్ని బడులకు కొత్త హంగులు వస్తాయి అని చెబుతోంది. కానీ కేసీఆర్ సర్కారు మాత్రం తాము కూడా ఢిల్లీ బడులనే ఆదర్శంగా తీసుకుని పాఠశాలలకు నయా హంగులు సమకూరుస్తాం అని అంటున్నారు. తెలంగాణ లో సర్కారు బడులకు మంచి రూపు ఇచ్చేందుకు మన బస్తీ – మన బడి పేరిట , మన ఊరు – మన బడి పేరిట కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నామని చెబుతోంది. ఆ విధంగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డల నుంచి కూడా ఆర్థిక సాయం పొందాలనుకుంటోంది.
మొత్తం మూడు దశల్లో 26 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి, మూడు వేల బడులకు కొత్త రూపు ఇవ్వాలని భావిస్తోంది. మొదటి దశలో భాగంగా మూడు వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి, తొమ్మిది వేలకు పైగా బడులకు సకల సౌకర్యాలూ కల్పించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని పనులు సైతం చేపట్టామని చెబుతోంది. మొత్తం 12 రకాల సౌకర్యాలతో ఇప్పటికే గన్ ఫౌండ్రీ బాలికల పాఠశాలకు కొత్త రూపు ఇచ్చామని చెబుతోంది.
ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కేసీఆర్ ఏనాడయినా ప్రభుత్వ బడులను సందర్శించిన దాఖలాలు ఉన్నాయా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సొంత రాష్ట్రంలో బడుల సందర్శన లేకుండా, ఢిల్లీ బడులు చూసి అబ్బురపడుడు ఏంటి అని అడుగుతున్నరు. ఇదే ఇవాళ సోషల్ మీడియా టాక్స్ లో వినపడుతున్న మాట!