మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఇవాళ సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. కడప జైలు అతిథిగృహంలో విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణకు హాజరు కావడానికి భాస్కర్ రెడ్డి పులివెందుల నుంచి కడపకు బయల్దేరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు హాజరవుతారు.
ఈ నెల 23న విచారణకు రావాలని గతంలోనే నోటీసులు జారీ చేయగా.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా హాజరు కాలేనని భాస్కర్‌రెడ్డి తిరిగి సీబీఐ కి లేఖ రాశారు. వివేక హత్య కేసులో రెండో సారి విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని నిన్న సీబీఐ నాలుగున్నర గంటలపాటు విచారించింది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన సునీల్ యాదవ్ ఆ హత్య జరిగిన రోజు తన ఇంట్లో ఎందుకున్నారని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అడిగినట్లు తెలిసింది. అది యాదృచ్ఛికంగానే జరిగిందా అని ప్రశ్నించినట్లు సమాచారం. మరో నిందితుడు గంగిరెడ్డితో తనకున్న సంబంధాలేంటి, ఆయనతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనీ ప్రశ్నలు సంధించినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.