వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఆశలతో నిలబెట్టిన నాయకులు గత ఏడాది ఎన్నికల్లో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గా నికి చెందిన ఔత్సాహిక యువకులను ఆయన ప్రోత్సహించి, టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూ డా ఉన్నారు. ఇలాంటి వారిలో పూతలపట్టు నుంచి విజయం సాధించిన ఎం.ఎస్.బాబు ఒకరు. నిజానికి జగన్ ఎంతో మందిని ప్రోత్సహించినప్పటికీ.. బాబుకు వారికి చాలా తేడానే ఉంది. దీనికి ప్రధాన కారణం.. బాబుకు పెద్దగా చదువు లేకపోవడమే. ఆయన 7వ తరగతితోనే చదువును మధ్యలో ఆపేశారు. ఆ వెంటనే ఎలక్ట్రీషియన్ పనులు నేర్చుకుని ఆ రంగంలో స్థిరపడ్డారు. తర్వాత ఆయన అనూహ్యంగా బిల్డర్‌గా అవతారం ఎత్తారు. ఈ క్రమంలో ఆర్ధికంగా బలపడ్డారు.
ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి రావాలని చేసిన ప్రయత్నం.. దానికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆశీర్వాదం తోడై.. ఆయనకు అనూ హ్యంగా గత ఏడాది ఎన్నికల సమయంలో పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ లభించింది. వాస్తవానికి ఈ టికెట్ కూడా అత్యంత నాటకీయ కోణంలో బాబుకు దక్కడం గమనార్హం. 2014లో ఇక్కడ నుంచి ఎం. సునీల్ కుమార్ వైసీపీ తరఫున విజయం సాధించారు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. అయితే, ఎన్నికలకు ముందు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పార్టీలో ఉంటూనే.. టీడీపీకి సహకరించారని, అధికార పార్టీని మచ్చిక చేసుకుని నిధులు కూడా తెచ్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జగన్ ఆయనను పక్కన పెట్టారు. కానీ, ఆయన మాత్రం పట్టు వీడని విక్రమార్కుడిగా.. టికెట్ కోసం ప్రయత్నించారు.
ప్రాణాంతక ఇంజెక్షన్ చేసుకుని మరీ జగన్‌ను హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఇక, సెల్ఫీ వీడియో కూడా తీసుకుని, తనకు టికె ట్ ఇవ్వకపోతే.. మరణమే తప్ప మరో మార్గం లేదని హెచ్చరించారు దీంతో నిజానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనూ జగన్.. ఆయనను పక్కన పెట్టారు. యువకుడు, ఎస్సీ వర్గానికి చెందిన బాబుకు ప్రాధాన్యం ఇచ్చి టికెట్ ఇచ్చారు. ఇక, ఎన్నికల సమయంలో బాబుపై టీడీపీ వర్గం భారీ దాడి చేసింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు కూడా! ఈ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చి.. దాదాపు 29 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఎం.ఎస్.బాబు విజయం సాధించారు. అయితే, ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు కూడా రాసిచ్చిన ప్రమాణ పత్రాన్ని చదవలేక పోయారు.
దీంతో అసెంబ్లీలోనే ఆయనపై విపక్ష సభ్యుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో వైసీపీలోనూ చర్చ సాగింది. మరీ పోయి పోయి ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారేంటనే ప్రశ్న వచ్చింది. కట్ చేస్తే.. బాబు ఇప్పుడు జగన్ మార్గదర్శకాల మేరకు నడుచుకుంటున్నారా? అనేది ప్రశ్న. ప్రస్తుతానికి ఆయన ఊసు ఎక్కడా వినిపించడం లేదు. అధికారులతో సమీక్ష సమయం లోనూ ఆయన పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అన్నీ తానై ఇక్కడ వ్యవహరిస్తున్నారు.