ఈరోజుల్లో టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. ఏ పని అయినా చిటికెలో అయిపోతోంది. కానీ ఇప్పటికీ కొన్ని పనులకు సామాన్యులకు తలకు మించిన భారంగానే ఉన్నాయి. అందుకే వీటి కోసం టెక్నాలజీ వాడితే సులువుగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో రెవెన్యూ డిపార్ట్ మెంట్ సేవలు కొన్ని.. ఏదైనా భూమి కొన్నప్పుడు అమ్మినప్పుడు డాక్యుమెంటేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంది.
వీటి కోసం తప్పనిసరిగా డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. అయితే ఇకపై ఆ సమస్య ఉండబోదు. ఏపీలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో కొత్త సౌకర్యం ప్రవేశపెడుతున్నారు. ఈశాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుతం అస్తవ్యస్తంగా వుందని భావించిన సీఎం.. ఆ శాఖలో సంస్కరణలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ఇకపై భూముల క్రయ, వియక్రయదారులే స్వయంగా చేసుకోవచ్చు. తన డాక్యుమెంట్ ను తానే తయారు చేసుకునే అవకాశం కల్పించారు. క్రయ, విక్రయదారులే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ రుసుమును కూడా ఆన్ లైన్ లో చెల్లించుకోవచ్చు. టైం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ భూముల రిజిస్ట్రేషన్ కోసం 16 రకాల నమూనా దాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో అధికారలు పొందుపరుస్తారు.
ఈ కొత్త విధానం ద్వారా అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల కమిషన్లు, ముడుపుల బాగోతాలు ఉండవు. అవినీతికి తావులేకుండా కొత్త విధానం అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. నూతన విధానాన్ని మొదట విశాఖపట్నం, కృష్ణాజిల్లాల్లో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపడతారు. ఆ తర్వాత రాష్ట్రమంతటికీ విస్తరిస్తారు.