మూడు రాజధానులు అనే అంశంతో ముందుకి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు లభించింది. ఈ నిర్ణయం మంచిదే అని ఆ నిర్ణయంపై కఠినంగా ఉండాలని కెసిఆర్, జగన్ కు సూచించారు. ఇరువురు ముఖ్యమంత్రులు సోమవారం ప్రగతి భవన్ లో సమావేశం కాగా మూడు రాజధానుల అంశం కెసిఆర్, జగన్ చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం రాష్ట్ర విభజన ఆలస్యానికి ప్రధాన కారణమైందన్నారు. అప్పట్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు కూడా హైదరాబాద్ స్థాయిలో కొంతైనా అభివృద్ధి చెంది ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో వచ్చేదన్నారు. ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టమని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే అన్ని సమస్యలకూ పరిష్కారం చూపుతుందన్నారు.
నిర్ణయం సరైందని అనుకున్నప్పుడు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించిన కెసిఆర్, కాస్త ఆలస్యంగానైనా ప్రజలు నిజాలను తెలుసుకుంటారన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలోనే జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 40 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచిందని కెసిఆర్ జగన్ కు సూచించారు. ఇప్పటికే ఈ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గని జగన్ కు కెసిఆర్ మద్దతు అదనపు బలాన్ని ఇచ్చింది.