ఏపీలో వెలుగులు నింపుతోన్న జ‌గ‌న్‌… స‌రికొత్త ప‌థ‌కానికి శ్రీకారం

-

ఏపీలో మ‌రో ప‌థ‌కం పురుడు పోసుకుంది. కంటివెలుగు పేరుతో ఏపీలోని ప్ర‌తి ఒక్క‌రికి కంటివెలుగులు అందించాల‌నే ల‌క్ష్యంతో ఈ కంటి వెలుగు ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. కంటి వెలుగు ప‌థ‌కం ఇప్ప‌టికే తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టి విజ‌యం సాధించింది. ఇప్పుడు ఇదే ప‌థ‌కాన్ని ఏపీలోనూ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్ అనంతపురంలో ప్రారంభించారు.

వైఎస్సార్‌ కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఏపీలోని 62 వేల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప‌థ‌కంలో ముందుగా మొద‌టి ద‌శ‌లో 70ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ప్రాథ‌మిక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈనెల 10 నుంచి 16వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేస్తారు.

త‌రువాత న‌వంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 31వ‌ర‌కు కంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి విజ‌న్ సెంట‌ర్ల‌కు పంపి చికిత్స చేస్తారు. త‌రువాత వారికి ఉచితంగా అద్దాలను పంపిణి చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కోసం 160 మంది జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, 1,415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములవుతారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ)కు నేత్ర పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపించారు. 42,360 మంది ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్‌ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు.

మూడు, నాలుగు, ఐదు, ఆరో దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మొత్తం ఆరు దశల్లో మూడేళ్లపాటు అమలు చేస్తారు. కంటివెలుగు కార్య‌క్ర‌మంతో ఏపీలోని కోట్లాది మందికి కంటి వెలుగు అంద‌నున్న‌ది.

Read more RELATED
Recommended to you

Latest news