ఈ ఉదయం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్, శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి దాదాపు అందరు మంత్రులూ హాజరుకాగా, నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం గమనార్హం. ఈ భేటీలో భాగంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శాసనమండలి రద్దుకు కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో పాటు కేబినెట్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కడప ఆర్‌అండ్‌బీ ఆఫీసు ఆవరణలోని టీడీపీ కార్యాలయం తొలగింపునకు కేబినెట్ ఆమోదించింది.
అంతేకాకుండా.. విజయవాడలో చినజీయర్ ట్రస్ట్‌కు 40 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. మరియు శాసన మండలి రద్దయితే మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అయితే వారిద్దరికి ఏ పదవులు ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని టీడీపీ నిర్ణయించింది. ఐతే… ఏపీ ప్రభుత్వం ఇవాళ మండలి రద్దుపై చర్చించాలని డిసైడైంది. అందువల్ల టీడీపీ సభ్యులు వచ్చినా, రాకపోయినా బిల్లు ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదించే అవకాశాలున్నాయి.